Site icon HashtagU Telugu

Bharat Rice : రూ.29కే కిలో భారత్ రైస్.. వచ్చే వారం నుంచే సేల్స్

Bharat Rice Price

Bharat Rice Price

Bharat Rice : నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ తరుణంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. గతేడాది చివర్లో కేంద్ర సర్కారు ప్రకటించిన విధంగా  ‘భారత్ బ్రాండ్’ బియ్యం విక్రయాలు మొదలుకానున్నాయి. వచ్చే వారం నుంచే బహిరంగ మార్కెట్‌లో వీటి సేల్స్‌ను  మొదలుపెట్టనున్నారు.   కిలో రూ.29 చొప్పున ఈ బియ్యాను విక్రయించనున్నారు.  ఈ వివరాలను కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా(Bharat Rice) శుక్రవారం ప్రకటించారు. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15 శాతం మేర పెరిగాయని ఆయన చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

నేషనల్‌ అగ్రికల్చర్‌ కోపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (నాఫెడ్), నేషనల్‌ కోపరేటివ్‌ కన్జ్యూమర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్‌ రిటైల్‌ కేంద్రాల్లో ‘భారత్ రైస్’‌ను విక్రయిస్తామని చోప్రా తెలిపారు. ఈ-కామర్స్‌ వేదికగానూ భారత్‌ రైస్‌ లభిస్తుందన్నారు. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో ‘భారత్‌ రైస్‌’ అందుబాటులో ఉంటుందని చోప్రా పేర్కొన్నారు. రిటైల్‌ మార్కెట్లో తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ దాల్‌ (శనగ పప్పు)ను రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తున్న విషయాన్ని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా గుర్తుచేశారు.

Also Read : Shots Fired : ఉగ్రవాది నిజ్జర్ అనుచరుడే టార్గెట్.. కాల్పులతో కలకలం

బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఇప్పట్లో ఎత్తివేసే ప్రసక్తే లేదని చోప్రా అన్నారు. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రిటైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్‌ వివరాలను కేంద్ర ఆహార శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బియ్యాన్ని నిల్వ చేయడంపై పరిమితి విధించబోతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. అవసరమైతే ఏ నిర్ణయమైనా తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతానికి మన దేశంలో బియ్యం తప్ప మిగిలిన అన్ని నిత్యావసరాల ధరలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.

Also Read :Whatsapp Feature : వెబ్ ​వర్షన్​​లోనూ ఆ వాట్సాప్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే ?

25 కిలోల బియ్యం బస్తా.. రూ.200 జంప్

మార్కెట్‌లో ఎక్కువగా లభించే సన్న రకాలైన సోనామసూరి, బీపీటీ, హెచ్‌ఎంటీ క్వింటాలు బియ్యం ధర గతంలో రూ.3,500-4,000 మధ్య ఉండేది. ప్రస్తుతం వాటిని రూ.5,000కు విక్రయిస్తున్నారు. క్వింటాలు రూ.4,500-5000 మధ్య ఉండే మేలు రకం బియ్యం ధర రూ.6,500కు చేరుకుంది. క్వింటాలు పాత బియ్యం ధర రూ.7,500గా ఉంది. 25 కిలోల ఫైన్‌ క్వాలిటీ బియ్యం బస్తాను రూ.1700-1800 మధ్య విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌ ధరలు పెరగడంతో నగరంలో రిటైల్‌ వ్యాపారులు 25 కిలోల బియ్యం బస్తా వద్ద సగటున రూ.200 వరకు పెంచేశారు.