Site icon HashtagU Telugu

Cars Safety: 2023 ఏప్రిల్ 1 నుంచి కార్లకు సేఫ్టీ రేటింగ్.. ఎందుకు.. ఎలా ?

Car Safety

Car Safety

కార్లకు కూడా త్వరలో స్టార్ రేటింగ్ ఇవ్వబోతున్నారు. ఈ రేటింగ్ పూర్తిగా ” సేఫ్టీ” ని ప్రామాణికంగా తీసుకొని ఇచ్చేది. ఇందులో భాగంగా కార్ల కంపెనీలు తయారు చేసే ప్రతి మోడల్ కు తొలుత క్రాష్ టెస్టింగ్ నిర్వహిస్తారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే.. కారు ఎంతమేరకు తట్టుకొని నిలువగలదు? అనే విషయాన్ని క్రాష్ టెస్టు ద్వారా తెలుస్తారు. ఈ నివేదిక ఆధారంగానే కారుకు స్టార్ రేటింగ్ ఇస్తారు.

2023 ఏప్రిల్ 1 నుంచి సేఫ్టీ రేటింగ్ ప్రక్రియ అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా, హైవేల శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంతకుముందు వరకు సేఫ్టీ రేటింగ్స్ కోసం ఇండియాలో కార్లు తయారు చేసే కంపెనీలు “గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం” (ఎన్ క్యాప్) పై ఆధారపడేవి. ఇకపై ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఎన్ క్యాప్ కార్యక్రమాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయనుంది.

ఏయే కార్లకు ?

8 మందిలోపు ప్యాసింజర్ల సామర్థ్యం కలిగిన కార్లకు సేఫ్టీ రేటింగ్ ఇస్తుంది. భారత్‌లో తయారు చేసిన వాహనాలు లేదా దిగుమతి చేసుకున్న వాహనాలకు కూడా క్రాష్ టెస్ట్ తప్పనిసరి. అయితే ఈ విధానాన్ని తప్పనిసరి చేయొద్దని మారుతీ సుజుకీ కంపెనీ సూచించింది. ఐరోపా తరహా రేటింగ్స్‌ ఇక్కడ అమలు చేయాలని చూడటం సరికాదని సంస్థ చైర్మన్‌ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ఇది ధనవంతులకు మాత్రమే మేలు చేస్తుందని చెప్పారు.

Exit mobile version