Bhajan Lal Sharma : రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన లాల్ శర్మ.. ఎమ్మెల్యే అయినా మొదటిసారే సీఎం..

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మని ప్రకటించింది బీజేపీ నాయకత్వం.

Published By: HashtagU Telugu Desk
Bhajan Lal Sharma Elected as New Chief Minister of Rajasthan from BJP

Bhajan Lal Sharma Elected as New Chief Minister of Rajasthan from BJP

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకత్వం సీఎంల ఎంపిక ఆచితూచి జాగ్రత్తగా చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తవాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. ‌మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్​ యాదవ్​ను, ఛత్తీస్​గఢ్​ సీఎంగా విష్ణు దేవ్​సాయ్​ని నియమించి అందర్నీ ఆశ్చర్యపరిచింది బీజేపీ.

ఇక రాజస్థాన్‌లో(Rajasthan) కూడా కొత్త సీఎం(CM) రాబోతున్నారని వార్తలు వచ్చాయి. గత బీజేపీ ముఖ్యమంత్రి వసుంధర రాజేని పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం ఇద్దామని బీజేపీ భావించింది. రాజస్థాన్‌లో 199 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లను గెలిచింది. రాజస్థాన్ సీఎం రేసులో మాజీ సీఎం వసుంధరా రాజే, దియా కుమారి, మహంత్​ బాలక్​నాథ్, కిరోడీలాల్​ మీణా, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్​రామ్ మేఘ్​వాల్, అశ్విన్​ వైష్ణవ్ లు ఉండగా వీరెవర్నీ కాదని ఓ కొత్త వ్యక్తికి అది కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మని ప్రకటించింది బీజేపీ నాయకత్వం. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈయన తొలిసారి సంగనేర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి పుష్పేంద్ర భ‌ర‌ద్వాజ్‌పై 48,081 ఓట్లతో గెలుపొందారు. భజన్ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాడు. అలాగే ఈయన RSS కి చెందిన వ్యక్తి కావడం విశేషం.

అయితే ఎంతోమంది సీనియర్ నేతలు ఉండగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి సీఎం పదవి ఇవ్వడం విశేషం. దీంతో భజన్ లాల్ శర్మ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నారు. ఈయన రాజస్థాన్ భరత్ పూర్ కి చెందిన వ్యక్తి. MA పొలిటికల్ సైన్స్ చేశారు. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రెటరీగా నాలుగు సార్లు పనిచేశారు. గతంలో 2008 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో అనేకసార్లు మోడీ రాజస్థాన్ కి వెళ్ళినప్పుడు ఆయన పక్కనే కనిపించేవారు. ఇక రాజస్థాన్ డిప్యూటీ సీఎంలుగా దియా సింగ్ కుమారి, ప్రేమ్ చంద్ భైరవలను ప్రకటించారు.

 

Also Read : Bihar Teachers: బీహార్ ఉపాధ్యాయులకు శుభవార్త

  Last Updated: 12 Dec 2023, 10:43 PM IST