Punjab Cabinet: మంత్రుల జాబితా వెల్ల‌డించిన పంజాబ్ సీఎం..!

  • Written By:
  • Updated On - March 19, 2022 / 09:50 AM IST

పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన రెండురోజుల్లోనే త‌న కేబినెట్‌కు సంబంధించిన మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పది మంది మంత్రులతో గవర్నర్ రేపు ప్రమాణం చేయిస్తారు. మార్చి 19న ఉదయం 11 గంటలకు చండీగఢ్‌లో మంత్రివర్గం కొలువుతీర‌నుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మొదటి మంత్రివర్గ సమావేశానికి మధ్యాహ్నం 12:30 గంటలకు అధ్యక్షత వహించనున్నారు.

శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న నేతలకు భ‌గ‌వంత్ మన్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తమ కేబినెట్ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుందని, పంజాబ్‌కు నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాలో హర్పాల్ సింగ్ చీమా, డాక్టర్ బల్జిత్ కౌర్, హర్భజన్ సింగ్ ETO, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్ కటరుచక్, గుర్మీత్ సింగ్ హేయర్‌, కుల్దీప్ సింగ్ ధాలివాల్, లల్జిత్ సింగ్ భుల్లర్, బ్రాం శంకర్ (జింపా), హర్జోత్ సింగ్ బెయిన్స్ లు ఉన్నారు.

మార్చి 16న, భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన పంజాబ్‌లోని ఖట్కర్ కలాన్‌లో జరిగిన మెగా ఈవెంట్‌లో భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ శాసనసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ డాక్టర్‌ ఇందర్‌బీర్‌ సింగ్‌ నిజ్జర్‌ చేత శాసనసభ్యుల ప్రమాణం చేయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పంజాబ్‌లో కొత్త మార్పును తీసుకువస్తుందని.. దీని కోసం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారని సీఎం మ‌న్ ట్విట్ట‌ర్ లో తెలిపారు. పంజాబ్ సిఎంగా తాను ఒక్క‌ రోజుని కూడా వృధా చేయనని వాగ్దానం చేశారు. అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చి 23న హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.