Shikhar Dhawan : బెట్టింగ్ యాప్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసును Enforcement Directorate (ఈడీ) గట్టిగా తవ్వికొడుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. సినీ తారలతో పాటు ప్రముఖ క్రికెటర్లపై ఈడీ దృష్టి పెట్టింది. తాజాగా భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ విచారణ కోసం ఈడీ ఎదుట హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ధావన్‌కు పీఎంఎల్‌ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద విచారణ నోటీసులు జారీ చేయబడటంతో ఆయన ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. విచారణ సందర్భంగా ధావన్ నుండి స్టేట్‌మెంట్‌ను అధికారుల బృందం రికార్డు చేసినట్లు తెలిసింది. ఈ విచారణలో ధావన్ ప్రమోట్ చేసిన యాప్స్‌కి సంబంధించి డబ్బుల ప్రవాహం, కమర్షియల్ డీల్స్ తదితర అంశాలపై ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Read Also: Kannappa : ఓటీటీలోకి వచ్చిన మంచు విష్ణు ‘కన్నప్ప’..
ఈడీ అభిప్రాయం ప్రకారం, ఇటీవలి కాలంలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వెనక పెద్ద మొత్తంలో నల్లధనం గుట్టుగా ప్రవహించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యాప్స్‌కు పబ్లిసిటీ ఇచ్చే సెలబ్రిటీలు వారిలో క్రికెటర్లు, నటులు ఉన్నారు. ప్రమోషన్ రూపంలో డబ్బులు స్వీకరించి ఉంటారన్న అనుమానంతో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ధావన్‌తోపాటు, గత నెలలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసు క్రమంగా ప్రముఖుల వరకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు విచారణలో బయటపడ్డ వివరాల ప్రకారం, కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ విదేశాల్లో రిజిస్టర్ అయ్యి, భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ యాప్స్‌కి ప్రచారం చేసిన సెలబ్రిటీల ప్రమోషన్ కాంట్రాక్టులు, వారి ఖాతాల్లోకి వచ్చిన డబ్బుల వివరాలను ఈడీ గట్టిగా పరిశీలిస్తోంది.
ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిషేధం నేపథ్యాన్ని కూడా ఈడీ దృష్టిలో పెట్టుకుని విచారణను వేగంగా పూర్తి చేయాలని చూస్తోంది. ఈ కేసులో ఇంకా ఏ ఏ ప్రముఖులు విచారణకు హాజరవుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ధావన్ వాంగ్మూలం, సురేశ్ రైనా విచారణలో వచ్చిన వివరాలు ఆధారంగా మరిన్ని నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయడం వెనక ఆర్థిక కుట్ర ఉందా? విదేశీ పెట్టుబడుల ఎటువంటి సంబంధం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు మరింత లోతుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే రోజుల్లో మరింత ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉన్నందున, ఇది క్రికెట్, సినీ రంగాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..