Site icon HashtagU Telugu

Tragedy : దర్శనే మాకు ఆదర్శం.. రేణుకాస్వామి హత్య తరహాలో మరో ఘటన

Tragedy (2)

Tragedy (2)

Tragedy : కర్ణాటకలో గతేడాది చోటుచేసుకున్న రేణుకాస్వామి హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నటి పవిత్ర గౌడ్‌కు అసభ్య సందేశాలు పంపించాడనే కారణంగా ఆమె ప్రియుడు, ప్రముఖ నటుడు దర్శన్ అనుచితంగా స్పందించి రేణుకాస్వామిని దారుణంగా హింసించి హత్య చేశాడు. ఈ ఘటన గత సంవత్సరం దేశాన్ని కుదిపేసింది. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో హింసాత్మక ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

అసభ్య సందేశాలపై యువకుడిపై కిడ్నాప్, దాడి

కుశాల్ అనే యువకుడు బెంగళూరులోని ఓ విద్యార్థినితో రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నాడు. కానీ వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాల వల్ల వారు విడిపోయారు. అనంతరం ఆ యువతికి మరో వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఈ పరిణామాలు కుశాల్‌కు నచ్చలేదు. తనను మోసం చేసిందన్న కోపంతో మాజీ ప్రేయసికి అసభ్యకరమైన సందేశాలు పంపించసాగాడు.

దీనిపై విసిగిపోయిన యువతి తన కొత్త ప్రియుడికి ఈ వ్యవహారాన్ని వివరించింది. దాంతో అతడు తన మిత్రులతో కలిసి కుశాల్‌ను కిడ్నాప్ చేసి, బెంగళూరుకు సమీపంలోని ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బట్టలు విప్పి, శారీరకంగా హింసించాడు. అతని ప్రైవేట్ భాగాలపై తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శన్ కేసే ప్రేరణగా తెలిపిన నిందితుడు

వైరల్ వీడియోలో ఒక నిందితుడు మాట్లాడుతూ, తాము చేసిన దాడికి దర్శన్-రేణుకాస్వామి కేసు నుంచే ప్రేరణ పొందామని, అదేలా చేయాలని అనిపించిందని పేర్కొన్నాడు. దర్శన్- రేణుకా స్వామి హత్య కేసును ప్రస్తావిస్తూ నవ్వుతూ మాట్లాడిన విధానం, ఈ ఘటన తీవ్రతను మరింత ఉధృతం చేసింది.

ఎనిమిది మంది అరెస్ట్.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం

ఈ దాడి కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. “మాట్లాడుకుందామని పిలిచి, కుశాల్‌ను కారులో తీసుకొచ్చి దాడి చేశారు” అని ప్రాథమికంగా పేర్కొన్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

దర్శన్ కేసు నేపథ్యం

గతేడాది జూన్ 8, 2024న, నటి పవిత్రకు అసభ్య సందేశాలు పంపాడని భావించి అభిమానిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నటుడు దర్శన్ ప్రధాన నిందితుడిగా నిలిచాడు. జూన్ 11న ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, కొన్ని నెలల పాటు జైల్లో గడిపిన అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ కేసులో మొత్తం 15 మంది పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారించారు.

Rashmika : స్టార్డమ్ వెనుక బాధలు.. సెలవులు అనేవి కలలాగే..