Anti Rape Bill : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ ‘అపరాజిత’ పేరుతో యాంటీ రేప్ బిల్లును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. రేప్, గ్యాంగ్ రేప్, లైంగిక వేధింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలలో సవరణలు చేసి ప్రత్యేక బిల్లుగా ఆమోదించిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఈసందర్భంగా అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ ప్రసంగించారు. తమ ప్రభుత్వ నిర్ణయాన్ని చారిత్రక అవసరంగా అభివర్ణించారు. తాము ప్రవేశపెట్టిన యాంటీ రేప్ బిల్లు రానున్న కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా పనికొస్తుందని ఆమె చెప్పారు. గత నెలలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో దురాగతానికి బలమైన జూనియర్ వైద్యురాలికి తాము ఈ బిల్లును నివాళిగా సమర్పిస్తున్నామని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
గవర్నర్‌కు చెప్పండి ఆమోదించమని..
ఈ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు సూచించాలని బీజేపీ నేత, బెంగాల్ విపక్ష నేత సువేందు అధికారిని దీదీ ఈసందర్భంగా కోరారు. ఈ బిల్లుకు ఆమోదం లభించాక జూనియర్ వైద్యురాలి ఘటనలో దోషులుగా తేలే వారిని ఉరితీయొచ్చన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ చట్టాలలోని లోపాలను అధిగమించేలా అపరాజిత బిల్లును రూపొందించాం. రేప్‌లు మానవత్వానికి వ్యతిరేకం. అలాంటి నీచమైన నేరాలను ఆపేందుకు కఠిన చట్టాలు తప్పక అవసరం. అందుకే మేం ఈ బిల్లును రెడీ చేశాం’’ అని మమత పేర్కొన్నారు.
Also Read :Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. 9 మంది మావోయిస్టులు హతం
యూపీ, గుజరాత్‌లలోనే మహిళలపై నేరాలు ఎక్కువ
‘‘బెంగాల్‌తో పోల్చుకుంటే యూపీ, గుజరాత్‌లలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. భారతీయ న్యాయ సంహితను ఆమోదించేందుకు రాష్ట్రాలను కేంద్ర సర్కారు అస్సలు సంప్రదించలేదు. ఏ మాత్రం చర్చలు లేకుండా దాన్ని ఆమోదించుకున్నారు’’ అని బెంగాల్ సీఎం ఆరోపించారు. కాగా, అపరాజిత బిల్లును బెంగాల్ బీజేపీ స్వాగతించింది. అయితే ఇప్పటికే భారతీయ న్యాయసంహితలోనూ ఈమేరకు నిబంధనలు ఉన్నాయని గుర్తు చేసింది. అపరాజిత బిల్లులో ఏడు సవరణలను సువేందు అధికారి ఈసందర్భంగా అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఈ బిల్లును వెంటనే రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన కోరారు. దీన్ని అమలు చేసి, దోషులను ఎక్కడికక్కడ కఠినంగా శిక్షించాలని తాము ప్రగాఢంగా కోరుకుంటున్నామని సువేందు అధికారి తెలిపారు. కాగా, అపరాజిత బిల్లులో భాగంగా రేప్, లైంగిక వేధింపుల కేసుల్లో దోషులుగా తేలే వారికి మరణశిక్షను ప్రతిపాదించారు.