Rekha Gupta : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన షాయరీని ప్రస్తావిస్తూ.. “నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాను.. ఎవరైనా ఆ తుపానుకు కాస్త చెప్పండి.. అదుపులో ఉండమని” అన్నారు. అత్యున్నత స్థాయి పదవి దక్కినప్పుడు తాను బాలీవుడ్ సినిమా ‘నాయక్’ లోని హీరోయిన్‌లా ఫీలయ్యానని ఆమె చెప్పారు.
Read Also: RED BOOK : ప్రకంపనలు – కొడాలి నాని అనుచరులకు పోలీసుల నోటీసులు
రేఖా గుప్తా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కావడం తన కల కాదు. కానీ ఈ పదవి లాటరీ కాదు అని చెప్పారు. మహిళలకు గుర్తింపు ఇవ్వాలనే సిద్ధాంతంతో ప్రధాని మోడీ పార్టీ నేతలు తనను సీఎంగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాల పాలనలోని లోపాలను సరిదిద్దేందుకు, అవినీతిని పారదోలేందుకు కట్టుబడి ఉన్నామని రేఖా గుప్తా వెల్లడించారు.
బీజేపీ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదంటూ ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ చేసిన విమర్శలను రేఖా గుప్తా తిప్పికొట్టారు. కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయి. ఇన్నేళ్లపాటు మీరేం చేశారో చూసుకోకుండా.. అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కానీ మాపై విమర్శలు చేస్తారా..? అని దీటుగా బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా నియమితులయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ఈ అవకాశం దక్కింది. సీఎంగా ఎన్నికైన వెంటనే ఆప్ విమర్శలు చేయడంతో ఆమె దీటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే.
కాగా, రేఖా గుప్తా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను 48 స్థానాల్లో గెలిచిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో బీజేపీ హైకమాండ్ చట్టసభల్లో ఏమాత్రం అనుభవం లేని రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నియమించింది.