నెటిజన్స్ బీ అలర్ట్.. తెలంగాణలో సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నయ్!

ప్రజల అవసరాలు పెరిగాయి. దాంతోపాటు టెక్నాలజీ వాడకమూ పెరిగింది. టెక్నాలజీ మాటున సైబర్ నేరాలూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. టెక్నాలజీ పట్ల అవగాహన లేకుంటే.. అకౌంట్స్ హ్యాక్ అవచ్చు. వ్యక్తిగత వివరాలు సైతం ఇతరులకు చేరొచ్చు.

  • Written By:
  • Updated On - October 25, 2021 / 11:56 AM IST

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి ఏడేళ్లు కావోస్తున్నా.. కొన్ని అంశాల్లో మాత్రం ఘోరంగా వెనుకబడిపోతోంది. ఇప్పటికే మానవ లైంగిక అక్రమ రవాణాలో టాప్ ప్లేస్ నిలిచిన ప్రత్యేక రాష్ట్రంలో సైబర్ నేరాలు సైతం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ క్రైమ్స్ 10 శాతం తెలంగాణకే చెందినవని గణాంకాలు చెప్తుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్) రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. అవగాహన లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం ఎలా వాడాలో తెలియకపోవడం వల్ల బాధితుల సంఖ్య పెరిగిపోతోందని చెప్పారు.

ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందట. గతేడాది దేశవ్యాప్తంగా 10% సైబర్ నేరాలు తెలంగాణలో వెలుగుచూశాయని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో’ స్పష్టంగా పేర్కొంది. అయితే చాలా మంది బాధితులకు అవగాహన లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియకపోవడం వల్ల నేరాల బారిన పడుతున్నారని నిఘా విభాగం పేర్కొంటుంది. “సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో అవగాహన కలిగి ఉండాలి. ప్రతిఒక్కరూ సైబర్‌ క్రైమ్‌లకు సంబంధించిన విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. క్రైమ్స్ బారిన పడకుండా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. టెక్నాలజీ వాడకంపై పూర్తి పట్టు ఉంటేనే క్రైమ్స్ అరికట్టవచ్చని స్పష్టం చేశారు రోహిణి ప్రయదర్శిని.

సైబర్ క్రైమ్స్ నేరాలను అరికట్టడలంలో భాగంగా విద్యా సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, బస్ స్టేషన్లలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఇప్పటికే అవగాహన పోస్టర్లు (మీమ్స్) అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నామని, ప్రముఖులు, పోలీసు అధికారులు రూపొందించిన అవగాహన వీడియోలు జనాల్లోకి తీసుకెళ్తున్నామని వివరించారు. ఈ మేరకు ప్రతి నెలా కనీసం 70 కార్యక్రమాలు చురగ్గా నిర్వహిస్తున్నామన్నారు. క్రైమ్స్ పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్: 155260 ప్రవేశపెట్టామని, ప్రజలు ఈ హెల్పై లైన్ ద్వారా కాల్ చేసి పలు సమస్యల గురించి కంప్లైంట్ చేయొచ్చని రోహిణి ప్రయదర్శిని చెప్పారు.