Site icon HashtagU Telugu

Prashant Kishor : 2024పై ‘మాన‌సిక’ సిద్ధాంతం

Modi Prashant Kishor

Modi Prashant Kishor

ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌ను సెమీఫైన‌ల్ గా బీజేపీ భావిస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు ట్రైల‌ర్ గా పోల్చుతూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విజ‌యోత్స‌వ స‌భ‌లో వినిపించాడు. అంతేకాదు, 2017 ఎన్నిక‌ల్లో యూపీలో స్వీప్ చేసిన బీజేపీ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేశాడు. ఇదంతా విప‌క్షాల‌ను మాన‌సికంగా కుంగ‌దీయ‌డానికంటూ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అంటున్నాడు. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల చుట్టూ రాజ‌కీయ ఉన్మాదాన్ని బీజేపీ అల్లుతోంద‌ని పీకీ ట్వీట్ చేశాడు. ఆ మాయంలో ప‌డొద్ద‌ని విప‌క్షాల‌కు హిత‌వు ప‌లికాడు.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను దేనిక‌దే చూడాలి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అసెంబ్లీకి పోల్చ‌లేం. అలాగే, అసెంబ్లీ ఫ‌లితాల‌ను లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు అన్వ‌యించ‌లేం. ఆయా రాష్ట్రాల్లో వ‌చ్చిన పూర్వ‌పు ఫ‌లితాల‌ను అవ‌లోకిస్తే, చాలా కొద్ది చోట్ల మాత్ర‌మే అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏక‌రీతిగా క‌నిపిస్తాయి. స్థానిక సంస్థ‌ల ఫ‌లితాల‌కు, అసెంబ్లీ ఫ‌లితాలు దాదాపుగా ఎక్క‌డా స‌రిపోల్చ‌లేం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌ను 2024 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఎందుకు పోల్చుతారంటూ పీకే ప్ర‌శ్నిస్తున్నాడు.

అస‌లైన యుద్ధం 2024లో ఉంద‌ని పీకే అంటున్నాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఫలితాలపై ఐదు రాష్ట్రాల ప్ర‌భావం ఉండ‌ద‌ని చెబుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని రెయిన్‌బో సంకీర్ణాన్ని బుల్‌డోజింగ్‌ చేస్తూ బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాలను కూడా అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే, కేజ్రీ వాల్ ఆధ్వ‌ర్యంలోని AAP పంజాబ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మూడు వంతుల మెజారిటీని గెలుచుకుంది.

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన మరుసటి రోజే పీకే కీల‌క వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. నాలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం రాబోవు సార్వత్రిక ఎన్నికల తీర్పును కూడా స్పష్టం చేసిందని గురువారం మోడీ అన్నాడు. ఆ విష‌యాన్ని రాజకీయ పండితులు గమనించాల‌ని కూడా సూచించాడు. 2019లో బీజేపీ విజయాన్ని 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల స్వీప్‌తో మోడీ ముడిపెట్టాడు.
“భారతదేశం కోసం యుద్ధం 2024లో జరుగుతుంది. ఏ రాష్ట్ర #ఎన్నికల్లో కాదు అని సాహెబ్‌కు ఇది తెలుసు! అందుకే ప్రతిపక్షంపై నిర్ణయాత్మక మానసిక ప్రయోజనాన్ని ఏర్పరచుకోవడానికి రాష్ట్ర ఫలితాల చుట్టూ ఉన్మాదం సృష్టించడానికి ఈ తెలివైన ప్రయత్నం. పడిపోకండి లేదా ఇందులో భాగం అవ్వకండి. తప్పుడు కథనం.“ అంటూ కిషోర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.