మవోయిస్టులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లాలో గత ఏడాది హింసాకాండ కేసులు తగ్గాయి. బస్తర్ జిల్లాలో మావోయిస్టుల హింసాకాండ కేసులు 2020 తో పోలిస్తే 2021లో 28 శాతం తగ్గాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. 2020లో 316 మావోయిస్ట్ హింసాత్మక కేసులను పోలీసులు నమోదు చేశారు. బస్తర్ డివిజన్ లోని ఏడు జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి, నేర పరిశోధన, కోవిడ్-19 పరిస్థితి, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల సమీక్ష తర్వాత ఈ నివేదికను విడుదల చేశామని.. అలాగే 2022 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా సమావేశంలో ఖరారు చేసినట్లు ఐజి తెలిపారు.
2021లో 550 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. 2020తో పోల్చితే దాదాపు 38 శాతం పెరిగిందని తెలిపారు. భద్రతా బలగాల చేతిలో హతమైన మావోయిస్టుల సంఖ్య 40 నుంచి 51కి చేరుకోగా.. అరెస్టయిన వారి సంఖ్య 438 నుంచి 487కి పెరిగింది. అయితే ఎన్‌కౌంటర్‌ల సంఖ్య గతేడాది 69 నుంచి 74కి పెరిగింది. ఇదిలా ఉండగా ఏడాది కాలంలో విధి నిర్వహణలో నక్సల్ దాడిలో 46 మంది భద్రతా బలగాలు కూడా మరణించారు. వీరిలో ఎక్కువగా ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ల (ఐఈడీ) సీజ్‌ల సంఖ్య 2020లో 278 నుంచి 169కి తగ్గిందని.. ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం కూడా 89 నుంచి 77కి తగ్గిందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది కాలంలో బస్తర్‌లో సమగ్ర అభివృద్ధి శిబిరాలుగా పనిచేసే 14 కొత్త భద్రతా శిబిరాలు వచ్చాయని ఐజి తెలిపారు. దీంతో గత మూడేళ్లలో మొత్తం కొత్త క్యాంపుల సంఖ్య 26కి చేరుకుంది. జిల్లాలో సాధారణ నేరాలు 3.32% పెరిగాయని ఐజీ తెలిపారు.
ఇదిలా ఉండగా 2020 (4962 కేసులు)తో పోలిస్తే 2021లో డివిజన్‌లో ఇతర నేరాల సంఘటనలు 3.32 శాతం (5127 కేసులు) పెరిగాయని పోలీసు నివేదిక చూపిస్తుంది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, వాహనాల సంఖ్య పెరగడం, పౌరులలో హక్కులపై అవగాహన పెరగడం (మరిన్ని కేసులను నివేదించడం/నమోదు చేయడం) కారణంగా ఈ నామమాత్రపు పెరుగుదల జాతీయ ధోరణికి అనుగుణంగా ఉందని ఐజీ చెప్పారు.
2020 నుంచి 2021 వరకు పెరిగిన నేరాల రేటుతో పోల్చితే గత సంవత్సరాల్లో పెరుగుదల తక్కువగా ఉందన్నారు. 2018-19 మధ్య ఐదు శాతం పెరుగుదల నమోదైంది, 2019-20 మధ్య, నాలుగు శాతం పెరుగుదల నమోదైంది. పెరుగుతున్న ట్రెండ్‌ని చూపించిన నేరాలలో హత్యలు (14 శాతం), అత్యాచారాలు (10 శాతం), అపహరణ/కిడ్నాప్ (10 శాతం) ఉన్నాయి. నిర్లక్ష్యం (IPC సెక్షన్ 304-A) కారణంగా సంభవించే మరణాల కేసులలో ఆందోళనకరమైన 29 శాతం పెరుగుదల కనిపించింది. ఇందులో ప్రధానంగా రోడ్డు, ఇతర ప్రమాదాల కారణంగా మరణాలు ఉన్నాయి. అయితే హత్యాయత్నం కేసుల్లో 21 శాతం, లైంగిక వేధింపుల కేసుల్లో 14 శాతం, హింసాత్మక ఘర్షణలు/ అల్లర్ల కేసుల్లో 30 శాతం, వరకట్న మరణాలు 20 శాతం, వరకట్న వేధింపులు 26 శాతం తగ్గాయి. భౌతిక దాడుల కేసుల్లో 25 శాతంగా నివేదిక చూపించింది. బీజాపూర్, నారాయణపూర్, బస్తర్, దంతేవాడ, కంకేర్, సుక్మా, కొండగావ్ జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లు (ఎస్పీలు), కాంకేర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సమావేశంలో ప్రస్తుత పరిస్థితి, 2022 కార్యాచరణ ప్రణాళికపై ప్రదర్శనలు చేశారు. బస్తర్ డివిజన్‌లో నియమించబడిన పారామిలటరీ బలగాలు, ప్రత్యేక సాయుధ బలగాల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.