Banks: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. జనవరి 30, 31వ తేదిన బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఆ రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చేపట్టనున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పేరుతో నిరసన చేపడుతున్నట్లుగా ఆలిండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.
నేడు యూఎఫ్‌బీయూ ముంబయిలో సమావేశమై పలు విషయాలను చర్చించింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేయనున్నట్లు తెలిపింది. తమ డిమాండ్ల పరిష్కారానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా బ్యాంకు సంఘాలు స్పందించడం లేదని, అందుకే తాము నిరసన చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో జనవరి 30, 31వ తేదిన సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం వివరాలను వెల్లడించారు.
ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని ఉండాలని, పెన్షన్ల అప్‌డేషన్, పెండింగ్ సమస్యల పరిష్కారం, జాతీయ పెన్షన్ వ్యవస్థను రద్దు చేయడం, వేతన సవరణపై సత్వరమే చర్చల ఆరంభించడం, అన్ని విభాగాల్లో ఉద్యోగులను నియమించడం వంటివి తమ డిమాండ్లని, వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపింది. ఉద్యోగ సంఘాలు చేపట్టనున్న ఈ ధర్నాతో రెండు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. నెల చివర కావడం వల్ల బ్యాంకు కస్టమర్లు అవస్థలు పడే అవకాశం ఉంది.