Site icon HashtagU Telugu

Message To India : ఇండియాకు బంగ్లాదేశ్ ప్రధాని థ్యాంక్స్.. ఏమన్నారంటే..

Message To India

Message To India

Message To India : ఇవాళ ఓ వైపు బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు  ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆసక్తికర సందేశమిచ్చారు. ‘‘1971 సంవత్సరంలో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్)  చేసిన విముక్తి యుద్ధానికి మద్దతు ఇచ్చినందుకు ఇండియాకు థ్యాంక్స్. 1975లో నా కుటుంబ సభ్యులు చాలామంది  హత్యకు గురైనప్పుడు నా  కుటుంబానికి  ఆశ్రయం ఇచ్చినందుకు భారత్‌కు ధన్యవాదాలు’’ అని ఆమె ఓటు వేసిన అనంతరం విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. ‘‘మేం చాలా అదృష్టవంతులం.. భారతదేశం మా నమ్మకమైన భాగస్వామ్య దేశం.. 1971 విముక్తి యుద్ధంలో వారు మాకు మద్దతు ఇచ్చారు. భారత ప్రజలకు శుభాకాంక్షలు’’ అని హసీనా(Message To India) తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల నిరసనలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్‌ను జైల్లో పెట్టడం, రైలుకు నిప్పు, పలు పోలింగ్ స్టేషన్లకు నిప్పు వంటి ఘటనలు రెండు రోజుల ముందు వరకు జరిగాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బంగ్లాదేశ్‌లో పోలింగ్ మొదలైంది. చాలామంది హసీనా ప్రత్యర్థులు కటకటాల వెనుక ఉన్నందున.. ఈసారి ఓటింగ్ శాతం ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 12 కోట్ల మంది బంగ్లాదేశీ ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ 76 ఏళ్ల హసీనా మరోసారి దేశ ప్రధాని అవుతారని అంచనా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు. ఇవాళ అర్ధరాత్రి కల్లా లేదా సోమవారం ఉదయం ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి.

Also Read: Ram Lalla Idol : అయోధ్యలో కొలువుతీరబోయే బాలరాముడి విశేషాలివీ..

షేక్ హసీనా తండ్రి హత్యతో..

బెంగాలీ మాట్లాడే ప్రజలు మెజారిటీ సంఖ్యలో నివసించే తూర్పు పాకిస్తానే బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్ దేశం సాధన కోసం జరిగిన యుద్ధంలో అక్కడి ప్రజలకు భారత్ మద్దతు పలికింది. ప్రత్యేక దేశం డిమాండ్‌తో తూర్పు పాకిస్తాన్‌ ప్రజలు చేసిన తిరుగుబాటును అణిచివేసేందుకు పాకిస్తాన్  1971 మార్చి 25న ఆపరేషన్ సెర్చ్‌లైట్‌ను ప్రారంభించింది. దీనికి లెఫ్టినెంట్ జనరల్ టిక్కా ఖాన్ నేతృత్వం వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ సైన్యం భారీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు సమాచారం. దీంతో భారత వైమానిక దళం (IAF) తూర్పు పాకిస్తాన్‌లోని పాక్ ఆర్మీపై దాడులు చేసింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి దండయాత్రకు ఆదేశించారు. అధికారికంగా 1971లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది. ఇందులో పాక్ ఓడిపోయింది. పాకిస్తాన్ సైన్యం లెఫ్టినెంట్ జనరల్ AAK నియాజీ లొంగుబాటు పత్రంపై సంతకం చేశారు. దీంతో తూర్పు పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌గా మారింది. అవామీ లీగ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ 1972 జనవరిలో దాని మొదటి అధ్యక్షుడు అయ్యాడు. 1974లో బంగ్లాదేశ్ రెండో  ప్రధానమంత్రిగానూ ఆయనే సేవలందించారు. 1975లో ముజీబ్ హత్యకు గురయ్యారు. షేక్ ముజిబుర్ రెహమానే ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తండ్రి.