SpiceJet: భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (SpiceJet) తన గగనతలాన్ని (Airspace) ఉపయోగించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. బకాయిలు చెల్లించకపోవడం వల్లే బంగ్లాదేశ్‌లోని తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కారణంగా స్పైస్‌జెట్ విమానాలు కోల్‌కతా నుండి గువహటితో సహా పలు ప్రాంతాలకు వెళ్లడానికి సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్‌జెట్ ప్రతినిధి స్పందిస్తూ.. తాము సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. “ఇవి పరిశ్రమలో సహజంగా వచ్చే సాధారణ సమస్యలు. వీటిని త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. దీనివల్ల మా విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడలేదు” అని ఆయన పేర్కొన్నారు.
Also Read: AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్
అయితే ఏ రకమైన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనే దానిపై స్పష్టమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. బకాయిలు చెల్లించలేదనే కారణంతోనే బంగ్లాదేశ్ తమ గగనతలాన్ని ఉపయోగించుకోకుండా ఎయిర్‌లైన్‌ను అడ్డుకుందని సమాచారం. Flightradar24.com గణాంకాల ప్రకారం.. కోల్‌కతా నుండి గువహటి, ఇంఫాల్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమానాలు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఉపయోగించడం లేదు. ఈ విమానాలు ప్రస్తుతం సుదీర్ఘ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నాయి.
