Baba Siddique Murder Case: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య సంచలనాన్ని సృష్టించింది. ముంబై పోలీసులు ఈ కేసును తీవ్రంగా విచారించారు. నెలల పాటు సిద్ధిఖీని చంపేందుకు ఎలా ప్రణాళికలు వేసారు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేరంలో అనేక వ్యక్తుల నెట్‌వర్క్ ఉన్నట్టు వెల్లడైంది. దర్యాప్తులో నిందితుల ప్రవర్తన, వారి పద్ధతులు, హత్యను చేపట్టేందుకు ఉపయోగించిన విధానాలు అందరికీ వెల్లడయ్యాయి.
పూణేలో బాబా సిద్ధిఖీని హతమార్చడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. దాడికి సంబంధించి సమాచారం సేకరించడానికి నిందితులు సిద్ధిఖీ నివాసాన్ని అనేకసార్లు సందర్శించినట్లు ఏఎన్ఐ నివేదించింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ కీలక ప్రత్యక్ష సాక్షులతో సహా 15 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేసింది.
‘ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి అందిన సమాచారం ప్రకారం, బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన అన్ని ప్రణాళికలు పూణేలో తయారుచేయబడ్డాయి. ఈ సంఘటన సమయంలో అక్కడ అనేక ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు’ అని ఏఎన్ఐ పేర్కొంది.
అక్టోబర్ 12న జరిగిన ఘటనకు కొద్దిసేపటికే అరెస్టయిన షూటర్లు గుర్మైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్ యూట్యూబ్ వీడియోలను చూసి శిక్షణ పొందినట్లు సమాచారం. సిద్ధిఖీ ఫోటోను అందుకున్న తర్వాత అతడిని లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో అనుమానితుల నెట్‌వర్క్ బయటపడింది. పూణేకు చెందిన ప్రవీణ్ లోంకర్ ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ఇటీవల అరెస్టు అయిన హరీష్‌కుమార్ నిసాద్ నిందితులకు రూ. 2 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయుధాలు డెలివరీ చేయడం, ఆర్థిక, రవాణా సహాయాన్ని అందించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
బాబా సిద్దిఖీ హత్యకేసులో అరెస్టయిన ప్రవీణ్ లోంకార్ శుభం లోంకార్ సోదరుడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో అతడి సంబంధాలు ఉండగా, పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అతడి పై హిస్టరీ షీట్ ఉన్నట్లు పోలీసుల సమాచారం. కాలేజీ డ్రాప్ అవుతున్న శుభం, 2018-19లో జైసల్మేర్‌లో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు హాజరైనప్పటికీ అర్హత పొందలేదు. అనంతరం నేర ప్రపంచంలోకి చేరుకొని యాక్టివ్‌గా మారాడు. జనవరిలో, అతని సోదరుడు ప్రవీణ్‌ను ఆయుధాల చట్టం కింద అకోలా పోలీసులు అరెస్టు చేశారు. తరువాత అతనికి బెయిల్ లభించింది. సెప్టెంబర్ 24 నుండి శుభం లోంకార్ కనిపించకుండా పోయాడు.
ఈ కేసులో ఇద్దరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. మరో అనుమానిత షూటర్ శివకుమార్ గౌతమ్, ప్రవీణ్ సోదరుడు శుభమ్ లోంకార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.
దర్యాప్తులో, నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్కువగా ఆధారపడినట్లు వెల్లడైంది. కమ్యూనికేషన్ కోసం స్నాప్‌చాట్‌ను, కాల్‌ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించారని తెలియవచ్చింది. దాడి జరగకముందు 25 రోజుల పాటు సిద్ధిఖీ నివాసం మరియు కార్యాలయంపై నిఘా పెట్టినట్లు కూడా సమాచారం అందింది.