Site icon HashtagU Telugu

Patanjali IPOs: వచ్చే ఐదేళ్లలో 4 ఐపీఓలు.. పతంజలి గ్రూప్‌ ఫ్యూచర్ ప్లాన్

Baba Ramdev

Ramdev Baba

యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్‌ భారీ ప్రణాళికలు రచించుకుంది. పతంజలీ గ్రూప్‌ టర్నోవర్‌ వచ్చే 5-7 ఏళ్లలో 2.5 రెట్లు పెరిగి రూ. లక్ష కోట్లకు చేరుతుందని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌ అంచనా వేశారు. అలాగే వచ్చే ఐదేళ్లలో నాలుగు గ్రూప్‌ కంపెనీల ఐపీఓ కూడా ఉండనున్నట్లు వెల్లడించారు. అవి పతంజలి ఆయుర్వేద్‌, పతంజలి మెడిసిన్‌, పతంజలి లైఫ్‌స్టైల్‌, పతంజలీ వెల్‌నెస్‌. తమ గ్రూప్‌నకు చెందిన పతంజలి ఫుడ్స్‌ (గతంలో రుచి సోయా) ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లో లిస్టయిందని, కంపెనీ మార్కెట్‌ విలువ రూ.40,000 కోట్లకు చేరుకుందన్నారు. ఈ వివరాలను విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రానున్న కొన్నేళ్లలో దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

ఇప్పటికే పతంజలి ఫుడ్స్‌ లిస్టింగ్..

ఇప్పటికే పతంజలి ఫుడ్స్‌ (గతంలో రుచిసోయా) స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైనట్లు బాబా రామ్‌దేవ్‌ గుర్తుచేశారు. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.50 వేల కోట్లుగా ఉందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పతంజలి ఆయుర్వేద్‌, పతంజలి మెడిసిన్‌, పతంజలి లైఫ్‌స్టైల్‌, పతంజలి వెల్‌నెస్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. రూ.4,300 కోట్లకు రుచి సోయాను పతంజలి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత దాన్ని ‘పతంజలి ఫుడ్స్‌’గా పేరు మార్చి ‘ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌’కు వెళ్లింది. తమ ఉత్పత్తులన్నీ నాణ్య మైనవని రామ్‌దేవ్‌ పునరుద్ఘాటించారు. కొన్ని రాజకీయ, మతపరమైన, ఔషధరంగ, బహుళజాతి కంపెనీల మాఫీయాలు తమ బ్రాండ్‌ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి న్యాయపరమైన నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.