Site icon HashtagU Telugu

Avian Flu : కేరళలో కొత్త వైరస్ కలకలం…బాతులను చంపాలని సర్కార్ ఆదేశం.!!

Avian Flu

Avian Flu

కేరళలో కొత్తరకం ఏవియన్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. అలప్పుజా జిల్లాలో బాతులలో ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ వైరస్ ప్రభావంతో హరిపాద్ మున్సిపాలిటీలోని వఝూతానం వార్డులో వందలసంఖ్యలో బాతులు మరణించాయి. వీటిని నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసిజెస్ కు పంపారు. ఆ బాతుల్లో ఏవియన్ ఫ్లూ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ఫాంకు కిలో మీటర్ పరిధిలో ఉన్న బాతులన్నింటినీ చంపాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలతో 10మంది సభ్యులతో కూడిన 8ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లు నిబంధనలకు అనుగుణంగా 20వేల బాతులను చంపేయనున్నాయి. సమీప ప్రాంతాల్లో వారం రోజులపాటు జంతు సంక్షేమ శాఖల నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వ్యాధి వ్యాప్తికి కిలోమీటర్ పరిధిలోని పక్షుల రవాణాపై నిషేధం విధించారు. వాటితో సన్నిహితంగా ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

ఏవియన్ ఇన్ ఫ్లూ ముప్పు పెరుగుతుండటంతో కేంద్రం కూడా నిఘా పెంచింది. ఈ ఫ్లూకు సంబంధించిన కేసులను విచారించేందుకు 7గురు సభ్యులతోకూడిన ఒక బృందాన్నికేంద్ర ఆరోగ్యశాఖ గురువారం కేరళకు పంపించింది. ఈ బృందం విచారణ అనంతరం నివేదికను మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది.