Live Chat Trap: లైవ్ చాట్ తో వలపు వల.. వీడియోలు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతుల ముఠా గుట్టురట్టు!!

యువత బలహీనతను ఆసరాగా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ ముఠాల ఆగడాలు పెరిగిపోయాయి.

Published By: HashtagU Telugu Desk
Arrested Imresizer

Arrested Imresizer

యువత బలహీనతను ఆసరాగా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ ముఠాల ఆగడాలు పెరిగిపోయాయి. ఈ తరహా ఒక ముఠా గుట్టును ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం..
ఈ ముఠా సభ్యులు ఒక పోర్న్ వెబ్ సైట్ ను తెరిచారు. అందులోకి వెళ్లి వీడియోలు చూసే వారి మెయిల్స్ కి తొలుత గ్యాంగ్ సభ్యులు మెసేజెస్ పంపుతారు. ఆ మెయిల్స్ కు రిప్లై ఇచ్చి, వాట్సాప్ నంబర్ ఇచ్చే వాళ్లకు గ్యాంగ్ లోని అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు. మాయ మాటలతో క్లోజ్ అవుతారు. రాత్రికి వీడియో కాల్ చేయమని చెబుతారు. దీంతో వలలో చిక్కుకున్న యువకులు ఎగిరి గంతేసి.. వీడియో కాల్ చేస్తారు. ఈక్రమంలో యువకులు నగ్నంగా ఉన్న ఫోటోల స్క్రీన్ షాట్స్ ను ముఠాలోని యువతులు తీసుకుంటారు. ఇందుకోసం ముందుగానే తమ స్మార్ట్ ఫోన్ కు వెబ్ క్యామ్ ను లింక్ చేసి పెట్టుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. యువకుల నగ్న వీడియోలు, ఫోటోలు రికార్డు చేసి.. కాల్ చేసిన మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ల ఫోన్లకు పంపేవారు. ఇవి సోషల్ మీడియా లో వైరల్ కావద్దంటే తాము అడిగినంత డబ్బును ముట్టజెప్పాలని యువతులు బ్లాక్ మెయిలింగ్ కు దిగేవారు. ఇలా వేధింపులు ఎదుర్కొన్న కొంతమంది పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు ముఠా ఉండే ఇంటిని గుర్తించి, అక్కడికి వెళ్లి గ్యాంగ్ లోని ముగ్గురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. వీరికి సహకరిస్తున్న ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు అప్రమత్తం..

సైబర్‌ నేరగాళ్లు రోజుకో రూపంలో మోసాలకు తెగబడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌ మీడియాలో ఉంచకూడదు. సెల్‌ఫోన్‌లో చిన్నపాటి ప్రైవసీ సెట్టింగ్‌ చేసుకుంటే చాలా మంచిది. ప్రధానంగా ఫేస్‌బుక్‌ హ్యాక్, వాట్సాప్, మెస్సేంజర్, వీడియో కాల్స్‌ ద్వారా ఆకర్శించి దోపిడీ చేస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వీడియోకాల్స్, సందేశాలకు స్పందించకపోతే సురక్షితంగా ఉన్నట్లే. కాదని ఆకర్శితులైతే బ్లాక్‌మెయిలర్స్‌ వలలో పడక తప్పదు. కొత్త వ్యక్తులు పంపే సందేశాలు, లింకులను అసలు ఓపెన్‌ చేయవద్దు. ఒకవేళ ఇలాంటి ఉచ్చులో పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

  Last Updated: 18 Sep 2022, 11:41 AM IST