Site icon HashtagU Telugu

Rekha Gupta : ఢిల్లీ సీఎం పై దాడి..దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు

Attack on Delhi CM.. Sensational details come to light in investigation

Attack on Delhi CM.. Sensational details come to light in investigation

Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఇటీవల జరిగిన దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా అరెస్టైన రాజేశ్ సక్రియా పక్కా పన్నాగంతో దాడికి తెగబడినట్లు తాజా పోలీసు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతను మొదట్లో ఆమెపై కత్తితో దాడి చేయాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ, భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండటంతో చివరికి తన దాడి తీరును మార్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలో వీధికుక్కల పెరుగుతున్న సంఖ్య, ప్రజలకు వాటి వల్ల ఏర్పడుతున్న సమస్యలపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. వీధికుక్కలను నివాస ప్రాంతాల నుంచి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఇదే అంశంపై సక్రియా గతంలో సీఎం రేఖా గుప్తాను పలుమార్లు కోరినట్లు అతను చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. కానీ సీఎం స్పందించకపోవడంతో ఆగ్రహించిన రాజేశ్, ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేగాక, అతడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి. ముందుగా ఢిల్లీలోని సుప్రీంకోర్టు వద్దకు చేరుకున్నప్పటికీ, అక్కడ భద్రత గట్టి ఉండటంతో వెనక్కి వెళ్లిపోయాడు.

Read Also: AP New Bar Policy : 840 కొత్త బార్లకు 30 అప్లికేషన్లే..మరి ఇంత దారుణమా..?

అనంతరం సీఎం కార్యాలయంలో జరిగే ప్రజా వినతి కార్యక్రమమైన ‘జన్ సున్వాయీ’కు కత్తితో హాజరయ్యాడు. అయితే అక్కడ కూడా భద్రత దృఢంగా ఉండటంతో, తన వద్ద ఉన్న కత్తిని బయటే పడేసి లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన అనంతరం రేఖా గుప్తాను ప్రత్యక్షంగా కలిసిన సక్రియా, ఆమెతో వాగ్వాదం చేసాడు. ఆగ్రహంతో ఆమె చెంపపై కొట్టి, తోసేసి, జుట్టు పట్టుకుని లాగాడు. ఈ ఘటన అనంతరం ఆయనను అక్కడే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించిన పోలీసులకు మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. ఈ దర్యాప్తులో మరో కీలక మలుపు తలెత్తింది. దాడికి ముందు సక్రియాకు సహాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సక్రియాకు స్నేహితుడైన తహసీన్ సయ్యద్. అతనిని రాజ్‌కోట్‌లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. విచారణలో తేలినదేమిటంటే, తహసీన్ దాడికి ముందు సక్రియాకు డబ్బు పంపాడు. అంతేకాకుండా ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అంతటితో ఆగకుండా, సక్రియా సీఎం నివాసాన్ని వీడియోతీసి తహసీన్‌కు పంపినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, రాజేశ్ సక్రియాపై గుజరాత్‌లో పలు మద్యం అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసుల సమాచారం. అతడి నేరచరిత్రను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీధికుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు మరిన్ని కీలక విషయాలను వెలికితీసేందుకు సాంకేతిక ఆధారాలతో కూడిన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సిసిటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు, డిజిటల్ డేటా ఆధారంగా మరింత లోతుగా విచారణ సాగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also:MLC Kavitha : కవితతో మాకు ఎలాంటి సమస్య లేదు – జగదీశ్ రెడ్డి