Site icon HashtagU Telugu

Toll Plaza : ఆర్మీ జవాన్‌పై దాడి ఘటన..మారిన వైఖరి, మర్యాదగా వ్యవహరిస్తున్న టోల్‌గేట్‌ సిబ్బంది..

Attack on Army jawan..Changed attitude, polite behavior of tollgate staff..

Attack on Army jawan..Changed attitude, polite behavior of tollgate staff..

Toll Plaza : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆర్మీ జవాన్ కపిల్ కవాడ్‌పై టోల్‌గేట్ సిబ్బంది దాడి చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దేశ రక్షణ కోసం సేవలందిస్తున్న ఓ సైనికుడిపై ఈ స్థాయిలో దాడి జరగడం పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను కేంద్ర రహదారి శాఖ, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అత్యంత గంభీరంగా తీసుకుంది.

ఘటన ఎలా జరిగింది?

యూపీకి చెందిన కపిల్ కవాడ్ శ్రీనగర్‌లో ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల సెలవులకు స్వస్థలానికి వచ్చి తిరిగి డ్యూటీకి హాజరు కావడానికి తన కుటుంబంతో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి కారులో బయలుదేరారు. ప్రయాణ సమయంలో మేరఠ్ జిల్లాలోని భూని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు ముందుకు పంపడంలో ఆలస్యం జరుగుతుండటాన్ని గమనించిన కపిల్, అక్కడి సిబ్బందిని ఆ విషయంలో ప్రశ్నించారు. అక్కడి సిబ్బంది ఎందుకు అడుగుతున్నావు? అనే స్థాయిలో స్పందించడంతో వాగ్వాదం తలెత్తింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసి, జవాను కపిల్‌ను స్తంభానికి కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

పోలీసుల స్పందన

ఈ దాడిపై కపిల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాధ్యులైన టోల్‌గేట్ సిబ్బందిని అరెస్టు చేశారు. వారిపై విచారణ కొనసాగుతోంది. ఈ దాడి సైనికులపై దాడిగా మాత్రమే కాకుండా, దేశ భద్రతను అవమానపరిచే చర్యగా భావించి, పోలీసులు, అధికారులు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఎన్‌హెచ్‌ఏఐ కఠిన చర్యలు

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఏఐ, టోల్ వసూలు ఏజెన్సీపై రూ.20 లక్షల భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా, సంబంధిత ఏజెన్సీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సన్నాహాలు మొదలుపెట్టింది. రహదారి వినియోగదారుల భద్రతకు, గౌరవానికి పెద్దపీట వేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంలో అధికార యంత్రాంగం గుర్తించింది.

మారిన వైఖరి, మర్యాదగా వ్యవహరిస్తున్న సిబ్బంది

ఈ ఘటన అనంతరం మారిన పరిణామాలు గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాలన్నింటిలోనూ సిబ్బంది తాలూకు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ప్రత్యేకించి సైనిక వాహనాలు చూసిన వెంటనే టోల్‌ సిబ్బంది సెల్యూట్‌ చేస్తున్నారు. పలు చోట్ల వారికి తాగునీరు అందిస్తున్నారు. ఇది దేశ రక్షణలో ఉన్న సైనికుల పట్ల కనీస గౌరవం చూపించాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మారిన వాతావరణానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతున్నాయి. పలు వాహనదారులు కూడా టోల్ సిబ్బంది ప్రవర్తనలో వచ్చిన మార్పును ప్రశంసిస్తున్నారు. ఇది సామాన్య ప్రజానీకానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రజలందరికీ గౌరవం కలగాలంటే వ్యవస్థలే ముందుగా మారాలి.