Atishi To Take Oath: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ఆమోదం పొందింది. దీంతో ఇవాళ ఢిల్లీకి కొత్త సీఎం రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషిని (Atishi To Take Oath) నియమించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి ప్రమాణ స్వీకారం శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో జరగనుంది. ఆమెతో ఢిల్లీ ఎల్జీ (లెఫ్టినెంట్ గవర్నర్) వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణం చేయిస్తారని సమాచారం. అతిషితో పాటు ఐదుగురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు.
ఐదుగురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి ఎన్నికయ్యారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురు మంత్రి పదవుల ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆమె తరపున గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.
Also Read: PM Modi: అమెరికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..!
అతిషికి ఏపీతో అనుబంధం
దేశ రాజధాని ఢిల్లీకి కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న ఆతిషి మార్లేనా సింగ్.. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఢిల్లీకి సీఎం కానున్న ఆతిషి.. మధ్యప్రదేశ్‌లోనే కాదు ఏపీలోనూ ఆమె టీచర్‌గా పనిచేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సమీపంలో ప్రఖ్యాత రిషీ వ్యాలీ స్కూల్ పిల్లలకు ఆతిషి పాఠాలు బోధించారట. 2013 ఆ సమయంలో ఆమె ఇక్కడ పనిచేసినట్లు సమాచారం.
కేజ్రీవాల్ రాజీనామా చేశారు
ఎక్సైజ్ పాలసీ కేసులో ఐదు నెలలకు పైగా తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్ 13న బయటకు వచ్చారు. బీజేపీ చేసిన ఆరోపణలతో హఠాత్తుగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల నుంచి నిజాయితీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే మళ్లీ ముఖ్యమంత్రి పదవికి వస్తానని అన్నారు. దీని తర్వాత కేజ్రీవాల్ రాజీనామా చేయగా, అతిషి నేడు సీఎం పదవికి ప్రమాణం చేయనున్నారు.