Site icon HashtagU Telugu

Atishi : క్షీణించిన అతిషి ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేర్చిన ఆప్ నేతలు

Atishi Hospitalised

Atishi : హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను మంగళవారం తెల్లవారుజామున నగరంలోని లోక్​నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రిలో చేర్పించారు. షుగర్​ లెవెల్స్ 36కు పడిపోవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించామని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. తొలుత అతిషి బ్లడ్ శాంపిల్స్‌ రిపోర్టును వైద్యుల వద్దకు తీసుకెళ్లామని.. వాటిని  చూసిన వైద్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారని ఆయన తెలిపారు.అందుకే హుటాహుటిన లోక్​నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రిలో చేర్పించామన్నారు. ప్రస్తుతం అతిషికి(Atishi) డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని,  రిపోర్ట్​ వచ్చాకే ఏమైనా చెబుతామని సౌరభ్ భరద్వాజ్ స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఢిల్లీ ప్రజలకు నీరు అందించడం కోసం గత 5 రోజులుగా అతిషి నిరహార దీక్ష చేస్తున్న విషయాన్ని ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్ గుర్తుచేశారు. ఐదురోజులుగా ఆహారం తినకపోవడంతో అతిషికి బీపీ, షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధరించారని ఆయన తెలిపారు.  ఏమీ తినకపోవడంతో అతిషి శరీరంలో కీటోన్‌ స్థాయి పెరిగిందని, బరువు తగ్గిందన్నారు. పరిస్థితి విషమించే అవకాశం ఉండటంతో.. అతిషిని వెంటనే ఆస్పత్రిలో చేర్చించామని సంజయ్ చెప్పారు.

Also Read :Julian Assange : ‘వికీలీక్స్’ అసాంజేకు విముక్తి.. 1901 రోజుల తర్వాత కటకటాల నుంచి స్వేచ్ఛ

కాగా, హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని విడుదల చేయాలని కోరుతూ జూన్​ 21 నుంచి అతిషి నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రతిరోజూ  హస్తినకు అందాల్సిన నీటి కంటే 100 ఎమ్​జీడీ (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) తక్కువగా హర్యానా ప్రభుత్వం విడుదల చేస్తోందని అతిషి అంటున్నారు. హర్యానా ప్రభుత్వం చేష్టల వల్లే దాదాపు 28 లక్షల మంది ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆమె చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందిస్తూ.. ‘‘హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి ఢిల్లీ నీటి సమస్య గురించి వివరించాను. సమస్యను పరిష్కరించాలని కోరాను. ఆయన సానుకూలంగా స్పందించారు’’ అని చెప్పారు.

Also Read :Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!