AstraZeneca : ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ఉపసంహరణ.. కారణం అదే !

AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ వల్ల కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయని ఇటీవల ఒప్పుకున్న ఆస్ట్రాజెనెకా కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది. 

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 08:09 AM IST

AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ వల్ల కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయని ఇటీవల ఒప్పుకున్న ఆస్ట్రాజెనెకా కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది.  తమ కరోనా వ్యాక్సిన్‌ను  ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించామని వెల్లడించింది. వాణిజ్యపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. కరోనా వైరస్ కొత్తకొత్త వేరియంట్లను ఎదుర్కోగల సరికొత్త వ్యాక్సిన్లు మార్కెట్లో సరిపడా అందుబాటులోకి వచ్చినందున .. ఇంకా తమ వ్యాక్సిన్ అవసరం లేదని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈమేరకు వివరాలతో ‘ది టెలిగ్రాఫ్’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. ఇకపై కరోనా వ్యాక్సిన్‌ను తాము ఉత్పత్తి చేయబోమని, అది ఇకపై వ్యాక్సినేషన్ కోసం అందుబాటులో ఉండదని ఆస్ట్రాజెనెకా(AstraZeneca) కంపెనీ తేల్చి చెప్పింది. ఐరోపా దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ సప్లై కోసం తాము తీసుకున్న మార్కెటింగ్ లైసెన్సులను కూడా వదులుకున్నట్లు పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join

బ్రిటీష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కలిసి ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఇదే వ్యాక్సిన్‌ను మన దేశంలో ఉత్పత్తి చేసి, పంపిణీ చేసే బాధ్యతను పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తీసుకుంది. మన దేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు కొవిషీల్డ్‌ అనే పేరు పెట్టారు. ఈ వ్యాక్సిన్ ప్రభావంతో మరణాలు సంభవించాయంటూ, ఆరోగ్యాలు దెబ్బతిన్నాయంటూ యూకేకు చెందిన ఎంతోమంది కోర్టులను ఆశ్రయించారు. వీరంతా దాదాపు రూ.1000 కోట్ల మేర నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆస్ట్రాజెనెకా కంపెనీని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : Mayawati Heir : మాయావతి సంచలన నిర్ణయం.. ‘రాజకీయ’ వారసుడిపై వేటు

ఈ పిటిషన్లకు సమాధానం ఇస్తున్న క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో యూకేలోని ఓ కోర్టులో ఆస్ట్రాజెనెకా కంపెనీ కీలక వివరాలను వెల్లడించింది. తమ వ్యాక్సిన్ వల్ల కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన విషయాన్ని అంగీకరించింది. రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం వంటివి జరిగాయని తెలిపింది. కొంతమందికి గుండెపోటు వచ్చిందని చెప్పింది. అయితే భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలను నిలపడంలో తమ వ్యాక్సిన్ సక్సెస్ అయిందని ఆస్ట్రాజెనెకా కంపెనీ కోర్టుకు తెలిపింది. తమ ప్రయత్నాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు గుర్తించాయని వివరించింది.

Also Read :Pawan Kalyan : పవన్ కోసం కదిలొస్తున్న టాలీవుడ్.. మెల్లిగా అందరూ బయటకి వచ్చేస్తున్నారుగా..