Site icon HashtagU Telugu

Online Scammers : అంత‌ర్జాతీయ ఆన్‌లైన్ స్కాం ముఠా గుట్టు ర‌ట్టు చేసిన అస్సాం పోలీసులు

Cyber Crime 1 1

Cyber Crime 1 1

అస్సాం పోలీసులు అంత‌ర్జాతీయ ఆన్‌లైన్ స్కాం రాకెట్‌ను చేధించారు. గౌమ‌తి స‌హా వివిధ ప్రాంతాల నుండి అంతర్జాతీయ ఆన్‌లైన్ స్కామర్ల ముఠాని పోలీసులు ప‌ట్టుకున్నారు. 47 మంది బాలికలు, ముగ్గురు సూత్రధారులతో సహా 191 మంది స్కామర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని వారాలుగా పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించే పనిలో ఉన్నారని గౌహతి పోలీసు కమిషనర్ దిగంత బరా తెలిపారు. ఇళ్లు, భవనాలు, మాల్స్‌తో సహా ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో పోలీసు బృందాలు దాడులు నిర్వహించి 164 డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 90 ల్యాప్‌టాప్‌లు, 26 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు.

పోలీసులు ప‌క్కా స‌మాచారం త‌రువాతే దాడులు జరిగాయని క‌మిష‌న‌ర్ తెలిపారు. గురువారం రాత్రి ప్రారంభమై శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయని చెప్పారు. అరెస్టయిన వారు 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులేనని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు సూత్రధారులను కూడా అరెస్టు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. కరీంగంజ్‌ చెందిన దేబజ్యోతి డే అలియాస్ డేవిడ్ (వయస్సు 30-31 సంవత్సరాలు), లూథియానాకు చెందిన రాజేన్ సిదానా (రెండు కాల్ సెంటర్‌ల యజమాని), ఢిల్లీకి చెందిన దిబ్యం అరోరా (31) గుర్తించారు. గౌహతిలోని బామునిమైదాన్, బోర్బారి, రాజ్‌గఢ్, గాంధీబస్తీ, ఏబీసీ పాయింట్, గణేష్‌గురి వద్ద దాడులు నిర్వహించామని.. ఈ కేసులో సాక్ష్యంగా అనేక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని క‌మిష‌న‌ర్ తెలిపారు. ఈ నకిలీ కాల్ సెంటర్లకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీ, గుర్గావ్ తదితర ప్రాంతాల్లోని ముఠా సభ్యులతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు.

ఈ రాకెట్‌లో బాధితులు భారతీయులే కాకుండా అమెరికా వంటి ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నార‌ని తెలిపారు. డాలర్లలో చెల్లింపులు చేయడంతో ఆర్థికంగా నష్టపోయామని, మోసగాళ్లు హవాలా మార్గాల ద్వారా తమ ఇతర ఖాతాలకు సొమ్మును బదిలీ చేసుకునేవారని పోలీసు కమిషనర్‌ తెలిపారు. స్కామర్లు తమ కాల్ సెంటర్లను గుర్తించకుండా వివిధ ప్రాంతాలకు తరచూ మార్చేవారని విచారణలో వెల్లడైందని కమిష‌న‌ర్ బ‌రా తెలిపారు. ఈ కాల్ సెంటర్‌ల కోసం రిక్రూట్‌మెంట్ ప్రధానంగా Facebook, Instagram మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగిందని తెలిపారు. ఈ కాల్ సెంటర్ల ఉద్యోగులు వారు నిర్వహించిన విజయవంతమైన స్కామ్‌ల సంఖ్య ఆధారంగా ప్రోత్సాహకాలను అందుకున్నారని ఆయన తెలిపారు. ఆఫీసుల‌కు భవనాలను అద్దెకు ఇచ్చే సమయంలో ఆస్తుల యజమానులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలను నిరోధించాలని కమిషనర్ హెచ్చరించారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మరికొంత మంది స్కామర్లను త్వరలో అరెస్టు చేస్తామని క‌మిష‌న‌ర్ దిగంత బరా తెలిపారు.