Assam : అస్సాం బాంబు పేలుళ్ల కేసు : వారంతా నిర్ధోషులు ?

2004 ఆగస్టు 15వ తేదీన అస్సాంలోని ధేమాజీ కాలేజీ గ్రౌండ్స్ లో స్వాతంత్య్ర వేడుకలు జరుగుతుండగా బాంబు పేలుడు జరిగింది.

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 11:42 PM IST

సుమారు 20 ఏళ్ల క్రితం స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా అస్సాంలో(Assam) జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని గువాహటి హైకోర్టు గురువారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన శిక్షను కూడా హైకోర్టు కొట్టివేసింది. కేవలం బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో వారందరినీ నిర్థోషులుగా నిర్థారించినట్లు కోర్టు వెల్లడించింది.

2004 ఆగస్టు 15వ తేదీన అస్సాంలోని ధేమాజీ కాలేజీ గ్రౌండ్స్ లో స్వాతంత్య్ర వేడుకలు జరుగుతుండగా బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో 13 మంది చిన్నారులే ఉన్నారు. ఈ ఘటన ఆ సమయంలో యాత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడు బాధ్యత వహిస్తూ.. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ULFA) ప్రకటన చేసింది. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్ చేశారు.

2019లో ధేమాజీ జిల్లా సెషన్స్ కోర్టు అస్సాం పేలుడు కేసులో లీలా గొగొయ్, దీపాంజలి బురాగొహైన్, ముహీ హాందిక్, జతిన్ దుబోరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో ఇద్దరు నిందితులైన ప్రశాంత్ భుయాన్, హెమెన్ గొగొయ్ కి నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పును నిందితులు గువాహటి హైకోర్టులో సవాల్ చేశారు. జులై 24న వీరి పిటిషన్ పై విచారణలు ముగియగా.. తాజాగా (ఆగస్టు 24) తుది తీర్పు వెలువరించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో ఆరుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు చెప్పింది. అయితే.. ఈ కేసులో వీరు నిందితులను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందునే ఈ తీర్పు ఇస్తున్నట్లు కోర్టు ఈ సందర్భంగా తెలిపింది.

 

Also Read : 6 Indians Died: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు భారతీయులు దుర్మరణం!