ఎడాది దేశంలో కడుపు కూటి కోసం ఎంతో మంది వలస వెళుతుంటారు. పెట్రో బావులకు ఎంతో ఫేమస్ అయిన దుబాయ్ లో భారతదేశం నుండి వెళ్లి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆశపడే వారి సంఖ్య చాలా పెద్దది. దుబాయ్ లో వలస కార్మికులకు తగినంత జీతం లభిస్తున్నా అక్కడ పరిస్థితులు మాత్రం కాస్త ఇబ్బంది కరంగా ఉంటాయి.
అక్కడి వాతావరణానికి మన భారతీయులు కొంతమంది సెట్ అయితే మరికొందరు మాత్రం ఇబ్బందిపడతారు. ఇక ఫ్యామిలీతో వెళ్లే వారికి మరికొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆసియా దేశాలకు చెందిన చిన్నారులు బిల్డింగుల మీద నుండి కింద పడి చనిపోతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దుబాయ్ లో చోటుచేసుకుంది. దుబాలయ్ లోని దీరా జిల్లాలో 9వ అంతస్తులోని అపార్ట్ మెంట్ కిటికీలో నుండి ఓ చిన్నారి కింద పడి ప్రాణాలు విడిచింది. డిసెంబర్ 10వ తేదీన ఈ ఘటన జరిగినట్లు స్థానిక ఖలీజ్ టైమ్స్ పత్రిక డిసెంబర్ 11వ తేదీన వార్తను ప్రచురించింది. స్థానిక ప్రభుత్వ చట్టాలకు లోబడి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత సదరు చిన్నారి మృతదేహాన్ని భారతదేశానికి తరలించే అవకాశం ఉంది.
కాగా దుబాయ్ లో ఈ తరహా ఘటనలు ఈ ఏడాదిలో మూడు చోటుచేసుకున్నాయి. అవి కూడా ఆసియా దేశాలకు చెందిన చిన్నారులు ఇలా బిల్డింగుల మీద నుండి కింద పడి మరణిస్తుండటం కలచివేస్తోంది. గత నెలలో ఆసియా సంతతికి చెందిన మూడేళ్ల చిన్నారి షార్జాలో భవనం 14వ అంతస్తు నుండి పడి చనిపోగా, ఫిబ్రవరిలో 10 ఏళ్ల ఆసియా చిన్నారి షార్జాలోని రెసిడెన్షియల్ టవర్ 32వ అంతస్తు నుండి పడినట్లు సమాచారం.
