Iran Vs Israel : ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రోటోకాల్‌లను(Iran Vs Israel) పాటించాలని కోరింది. ‘‘దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయెల్‌లో అనవసర ప్రయాణాలను నివారించండి. సేఫ్టీ జోన్లకు సమీపంలోనే ఉండేందుకు ప్రయత్నించండి’’ అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
Also Read :Iran Attacks Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కాల్ చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లను భారత ఎంబసీ అనౌన్స్ చేసింది. +972 547520711, +972 543278392 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. పరిస్థితిని తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని భారత ఎంబసీ తెలిపింది. భారత జాతీయులందరి భద్రతను నిర్ధారించడానికి ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. భారతీయ పౌరులు సంప్రదించడానికి cons1.telaviv@mea.gov.inని షేర్ చేసింది. ఇంకా రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోని వారు వెంటనే సంప్రదించాలని భారత ఎంబసీ కోరింది.
Also Read :Rain : హైదరాబాద్ లో భారీ వర్షం..అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
ఇటీవలే లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయారు. గతంలో ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో జరిగిన దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా చనిపోయారు. ఈ ఇద్దరి మరణాలకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై ఇప్పుడు దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రతిదాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే.. తాము మరోసారి ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేస్తామని వెల్లడించింది. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. ఇరాన్ దాడులను అడ్డుకోవడంలో సాయం చేస్తామని తెలిపింది. ఎర్ర సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపును పెంచుతామని పేర్కొంది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.