Goa Politics : `గోవా`సంకీర్ణ పాలి`ట్రిక్స్`

ఎగ్జిట్ పోల్స్ త‌రువాత కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయ‌డానికి గోవా మీద ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - March 8, 2022 / 02:28 PM IST

ఎగ్జిట్ పోల్స్ త‌రువాత కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయ‌డానికి గోవా మీద ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. గ‌త చేదు అనుభావాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ముందుగా అప్ర‌మ‌త్తం అయింది. సంకీర్ణం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తోన్న బీజేపీ స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు, ఎంజీపీకి గాలం వేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ పోల్ ప్ర‌కారం గోవాలో హోరాహోరీ పోరు సాగింది. రాష్ట్రంలోని 40 సీట్లలో బిజెపి మరియు కాంగ్రెస్ రెండూ మెజారిటీ మార్కు 21 కంటే తక్కువగా 16 గెలుచుకునే అవకాశం ఉందని ఎక్కువ స‌ర్వే సంస్థ‌లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో గోవా 2017 దృష్టాంతాన్ని మళ్లీ ప్లే చేస్తోంద‌ని భావిస్తున్నారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్దది, కానీ అధికారాన్ని చేపట్టడంలో విఫలమైంది. MGPతో సహా చిన్న పార్టీలు మరియు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతును బీజేపీ ఆనాడు సాధించింది.

ఈసారి ఆ అవకాశం ప్ర‌త్య‌ర్థుల‌కు ఇవ్వ‌కుండా “కింగ్‌మేకర్‌లతో” చర్చలు జరపడానికి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ చిదంబరం, కర్ణాటక పీసీసీ చీఫ్ డికె శివకుమార్‌ గోవాకు వెళ్లారు. ఉత్త‌రాంఖండ్‌, మ‌ణిపూర్ కు కూడా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ల‌ను ఏఐసీసీ ఇత‌ర రాష్ట్రాల‌కు పంపింది.గత కొన్ని రోజులుగా చిదంబరం గోవాలో క్యాంపింగ్ చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ మద్దతు కోసం సాధ్యమైన అన్ని నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఇవ్వబడింది. గత ఎన్నికల్లో మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం కోసం పొత్తు పెట్టుకోవడంలో కాంగ్రెస్ అల‌క్ష్యం చేసింది. గోవాలో తిరిగి అధికారం కోసం BJP కీల‌క స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తోంది. ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యాడు. గోవాలో పార్టీ అధికారాన్ని నిలుపుకునే అవకాశాల గురించి వివ‌రించాడు. బిజెపి గోవా ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యేందుకు సావంత్ ముంబైకి వెళ్లనున్నాడు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి), స్వతంత్రులతో బిజెపి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2019లో మనోహర్ పారికర్ మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గోవా మంత్రివర్గం నుంచి పార్టీని తొలగించిన ప్రమోద్ సావంత్‌కు మద్దతు ఇవ్వడానికి MGP మొగ్గు చూపడం లేద‌ని స‌మాచారం.

 

MGPతో పాటు ఇతర పార్టీలు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నార‌ని తెలుస్తోంది. సంఖ్యాబలం కోసం సావంత్‌ను త్యాగం చేయాలనే ప్రశ్న బీజేపీకి ఎదురుకావచ్చని టాక్‌.
ఢిల్లీ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బద్ధ ప్రత్యర్థులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ (ఆప్)చ‌, తృణమూల్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నాం. తృణమూల్ కాంగ్రెస్ , ఆప్ లేదా గోవాలో బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ఎవరితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నాము” అని కాంగ్రెస్ నాయకుడు, గోవా ఇన్‌ఛార్జ్ దినేష్ గుండూరావు ప్ర‌క‌టించాడు. ఈ ఎన్నికలలో గోవాలో అరంగేట్రం చేసిన మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్‌కు ఎగ్జిట్ పోల్స్ ద్వారా మూడు సీట్లు ఇవ్వబడ్డాయి. సంఖ్యల గేమ్‌లో టీఎంసీ పార్టీకి కీలక పాత్రను సూచిస్తుంది. ఎంజీపీతో తృణమూల్ పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లిన విష‌యం విదిత‌మే.
మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ ను బేస్ చేసుకుని ముంద‌స్తుగా అధికారం కోసం క్యాంపు రాజ‌కీయాలు గోవాలో అప్పుడే ప్రారంభం కావ‌డం విశేషం.