Mumbai Drugs Case : ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ క్లీన్ చిట్.. ఆధారాలు లేవని స్పష్టీకరణ

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్లీన్ చిట్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 05:46 PM IST

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ అమాయకుడని.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. కోర్టుకు ఎన్సీబీ శుక్రవారం సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఆర్యన్‌ పేరు లేకపోవడంతో ఈవిషయం తేటతెల్లమైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురికి సంబంధించి కూడా తగిన సాక్ష్యాలు దొరకలేదని ఎన్సీబీ తెలిపింది. డ్రగ్స్‌ కలిగి ఉన్నారనే ఆరోపణలపై గతేడాది అక్టోబర్‌ 3న ఆర్యన్‌ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసింది. ఆర్యన్‌ 27 రోజుల పాటు జైల్లో గడిపారు. అక్టోబర్‌ 28న బొంబాయి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ జైలు నుంచి విడుదలయ్యేందుకు రెండు రోజుల సమయం పట్టింది.

దర్యాప్తులో కీలక అంశాలు..

* 2021 అక్టోబరులో ముంబైలో ఒక క్రూయిజ్ షిప్ లో ఎన్సీబీ దాడి చేసింది. డ్రగ్స్‌ కలిగి ఉన్నారనే అభియోగాలతో 14 మందిని అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరు ఆర్యన్ ఖాన్. దీనికి సంబంధించి 6000 పేజీల చార్జీ షీట్ ను ఎన్సీబీ దాఖలు చేసింది.
* ఈ కేసులో ఆర్యన్ సహా మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. కానీ అతడిని నిందితుడిగా చార్జీ షీట్ లో పేర్కొనలేదు.
* ఆర్యన్ తో పాటు మరో ఐదుగురికి వ్యతిరేకంగా ఎన్సీబీకి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
* ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కు అలవాటుపడ్డాడని, డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడనే అభియోగాలను ఎన్సీబీ తొలుత మోపింది.
* ఎన్సీబీ వాదనలను ప్రత్యేక కోర్టు సవాలు చేసింది. కేవలం వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా అంత తీవ్రమైన నేర అభియోగాలను విచారించలేమని స్పష్టం చేసింది.
* ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే ను అకస్మాత్తుగా తప్పించారు. ఆర్యన్ ఖాన్ ను దురుద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అభియోగాలతో సమీర్ పై ఈ చర్యలు తీసుకున్నారు.అంతేకాదు ఈ కేసును ముంబై కి చెందిన ఎన్సీబీ పరిధి నుంచి ఢిల్లీకి చెందిన ఎన్సీబీ పరిధికి మార్చారు.