Next Delhi CM : అరవింద్ కేజ్రీవాల్ మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి. అంటే ఆలోగా దాదాపు నాలుగు నెలల పాటు ఢిల్లీ సీఎంగా వ్యవహరించబోయేది ఎవరు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా జైలు నుంచి విడుదల కావడం.. మరోవైపు సీఎం పోస్టుకు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సిసోడియా జైలులో ఉండగా ఆయన గురించి కేజ్రీవాల్ చాలా బాగా మాట్లాడారు. బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేశారు. ఆయనను మిస్సవుతున్నా అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అలాంటి మనీశ్ సిసోడియా ఇప్పుడు బయటే ఉన్నారు. ఆయనకు సీఎం పోస్టును ఇచ్చేందుకు కేజ్రీవాల్ మొగ్గుచూపుతారా ? లేదంటే తనకు నమ్మిన బంట్లుగా ఉన్న అతిషి వంటి వాళ్లకు సీఎం సీటును(Next Delhi CM) అప్పగిస్తారా ? అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది.
Also Read :CM Siddaramaiah : స్టేజీపైకి దూసుకొచ్చిన యువకుడు.. సీఎం సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో లోపం
ఒకవేళ మనీశ్ సిసోడియాకు ఆ అవకాశం దక్కకుంటే.. ఆప్‌లోని సమీకరణాలు మారే అవకాశం ఉంది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి సిసోడియా పునరాలోచన చేసుకునే ఛాన్స్ లేకపోలేదు. అయితే ఇవాళ కేజ్రీవాల్ ఒక కీలక కామెంట్ చేసిన విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే.. ‘‘ప్రజలు మరోసారి ఆప్‌ను గెలిపించాకే నేను సీఎం, మనీశ్ సిసోడియా డిప్యూటీ సీఎం అవుతాం’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇప్పుడు తాను సీఎంగా కొనసాగితే.. మనీశ్ సిసోడియాకు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం పోస్టును సిసోడియాకు ఇవ్వకుంటే.. ఆయన వర్గీయుల నుంచి ఆప్‌లో అసమ్మతి పెరిగే ముప్పు ఉంటుంది. దాన్ని ముందే అంచనా వేసిన కేజ్రీవాల్.. తాను సీఎం పోస్టు నుంచి వైదొలగి తన అనుయాయుడిని ఆ సీటుపై కూర్చోబెట్టాలని భావిస్తున్నారు.
Also Read :Engineers Day 2024 : ఇవాళ ఇంజినీర్స్ డే.. ది గ్రేట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలివీ
ఢిల్లీ సీఎం రేసులో వీరే.. ?
- అతిషి – ఈమె ఆప్ సీనియర్ నాయకురాలు. కేజ్రీవాల్ జైలులో ఉన్న ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాబినెట్‌లోని ఐదు మంత్రిత్వ శాఖలు అతిషి వద్దే ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమం, విద్య, పర్యాటకం, కళ, సంస్కృతి, భాష, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, పవర్ శాఖలకు ఆమె మంత్రిగా ఉన్నారు.
- కైలాష్ గహ్లోట్ – ఈయన వద్ద ప్రస్తుతం ఎనిమిది మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. న్యాయ శాఖ, శాసన వ్యవహారాలు, రవాణా, పరిపాలనా సంస్కరణలు, ఐటీ, రెవెన్యూ, ఆర్థిక, ప్రణాళిక శాఖలు ఈయన వద్దే ఉన్నాయి.
- సౌరభ్ భరద్వాజ్ – ఈయన వద్ద ప్రస్తుతం ఏడు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. విజిలెన్స్, సేవలు, ఆరోగ్యం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, నీటిపారుదల, వరద నియంత్రణ, నీటి సరఫరా శాఖలు ఈయన వద్దే ఉన్నాయి.
- గోపాల్ రాయ్ – ఈయన వద్ద కీలకమైన దేశ రాజధాని అభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖ, పర్యావరణ శాఖ, అటవీ శాఖ, వన్యప్రాణుల శాఖ ఉన్నాయి.
- ఇమ్రాన్ హుస్సేన్ – ఈయన వద్ద ఢిల్లీలోని ఆహార, పౌర సరఫరాల శాఖ ఉంది.