Free Electricity : ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు 10 సంచలన హామీలు ఇచ్చారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే 10 హామీలను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేస్తానని ఆయన వెల్లడించారు. ఉచితంగా ప్రజలకు వైద్యసేవలను కూడా అందుబాటులోకి తెస్తానని చెప్పారు. ‘‘ఢిల్లీలో మేం ఇప్పటికే నిరంతర విద్యుత్ సరఫరా స్కీంను అమలు చేస్తున్నాం. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ ప్రతినెలా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందజేస్తాం’’ అని కేజ్రీవాల్ చెప్పారు. దేశవ్యాప్తంగా పేదలకు ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (Free Electricity) అందించేందుకు రూ. 1.25 లక్షల కోట్ల వ్యయమవుతుందన్నారు. ఆ నిధులను తాము ఏర్పాటు చేయగలమని కేజ్రీవాల్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో ఇలాంటి హామీలను అమలు చేసిన ట్రాక్ రికార్డు ఉందని ఆయన గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంటే.. కేవలం 2 లక్షల మెగావాట్లే వాడుకోగలుగుతున్నామని కేజ్రీవాల్ తెలిపారు. మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కెపాసిటీ మన దేశానికి ఉందన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లలో 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాను చేయగలిగినప్పుడు.. దేశవ్యాప్తంగానూ దాన్ని అమలు చేయడం ఈజీయే అని ఆప్ చీఫ్ చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం రూ. 5 లక్షల కోట్లు అవసరమని.. ఈ మొత్తాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చు చేయగలవన్నారు.
Also Read : Celebrities Vote : చిరు, చెర్రీ, ఎన్టీఆర్, మహేష్‌బాబు ఓటు వేసే పోలింగ్ కేంద్రాలివే
దేశంలోని వైద్యపరమైన మౌలిక సదుపాయాలను బెటర్‌గా మార్చేందుకు మరో రూ. 5 లక్షల కోట్లు అవసరమని ఆప్ చీఫ్ తెలిపారు. అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి గ్రామం, ఏరియాలో మొహల్లా క్లినిక్‌లను తెరుస్తామన్నారు. ప్రతి జిల్లా ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మన దేశ సరిహద్దుల్లో చైనా కబ్జా చేసిన భూమికి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారం రైతుల పంటలకు కనీస మద్దతు ధరను అందిస్తామన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని పేర్కొన్నారు.