Kejriwals Defeat : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చింది. ఏకంగా ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో అరవింద్ కేజ్రీవాల్ ఘోరంగా ఓడిపోయారు. దాదాపు 3000 ఓట్ల మెజార్టీతో పర్వేశ్ వర్మ విజయ దుందుభి మోగించారు. ఇంతకీ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఎందుకు ఓడిపోయారు ? ప్రధాన కారణాలు ఏమిటి ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Delhi Exit Polls : ‘ఎగ్జిట్ పోల్స్’ లెక్క తప్పింది.. ఢిల్లీలో కూలిన కేజ్రీ‘వాల్’
2013 ఎన్నికల్లో..
2013 సంవత్సరం నుంచి 2020 వరకు వరుసగా మూడుసార్లు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఆ మూడు ఎన్నికల్లోనూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విజయాన్ని సాధించారు. 2013 ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు 44,269 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్ 18,405 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. షీలా దీక్షిత్ సాధారణ నేత కాదు. ఆమె కాంగ్రెస్ అగ్రనేతలకు చాలా సన్నిహితులు. ఢిల్లీకి చాలా ఏళ్లపాటు సీఎంగా షీలా దీక్షిత్ సేవలు అందించారు. అలాంటి అగ్రనేతను 2013లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రభావంతో అరవింద్ కేజ్రీవాల్ ఓడించగలిగారు. షీలా దీక్షిత్ గతంలో పలుమార్లు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో గెలిచారు. ఆప్ పార్టీ ఆవిర్భావానికి ముందువరకు ఈ అసెంబ్లీ సీటు కాంగ్రెస్ పార్టీ కంచుకోట.
2015 ఎన్నికల్లో..
2015లో న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు 57,213 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నుపుర్ శర్మకు 25,630 ఓట్లు వచ్చాయి. అంటే 2015కల్లా ఈ స్థానంలో కాంగ్రెస్ బలహీనపడింది. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి 4,781 ఓట్లు వచ్చాయి.
2020 ఎన్నికల్లో..
2020లో ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ 46,758 ఓట్లు సాధించి గెలిచారు. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్‌కు 25,061 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన రోమేశ్ సభర్వాల్‌కు 3,220 ఓట్లు వచ్చాయి. గత నాలుగేళ్లలో లెక్కలు మారాయి. కేజ్రీవాల్ సారథ్యంపై న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ఫలితం ఈ ఎన్నికల్లో కనిపించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటమి ఎదురైంది.
Also Read :Delhi New CM : కౌన్ బనేగా ఢిల్లీ సీఎం ? సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే
ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమికి కారణాలు
- గత ఐదేళ్లలో న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలోని ప్రజలతో అరవింద్ కేజ్రీవాల్(Kejriwals Defeat) టచ్‌లోకి వెళ్లిన దాఖలాలు చాలా తక్కువ.
- అవినీతి ఆరోపణలు, ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారాలలో కేజ్రీవాల్ బిజీగా గడిపారు.
- న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతోంది అనే దానిపై కేజ్రీవాల్ ఫోకస్ పెట్టలేదు.
- కేజ్రీవాల్ బిజీగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను యాక్టివేట్ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై ముందస్తు ప్రణాళిక రెడీ చేసుకుంది. దాన్ని అమలు చేసి విజయం సాధించింది.
- క్షేత్రస్థాయిలో ప్రజలను సంతోషపెట్టకుండా.. ఎన్నికల్లో ఫలితం వస్తుందనే భ్రమల్లో నేతలు ఉండటం మూర్ఖత్వమే అవుతుంది. కేజ్రీవాల్ చేసిన పెద్ద తప్పు ఇదే.
- ప్రజలకు దూరంగా ఉంటూ.. ఎన్నికల్లో ఎప్పటికీ గెలుస్తామని నేతలు భావించడం తప్పిదమే అవుతుంది. ఈ తప్పిదాన్నే కేజ్రీవాల్ చేశారు.
- ప్రజలతో టచ్‌లో ఉండాలి. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన దాఖలాలు లేవు. అందుకే అక్కడి ఓటర్లు ఈ ఎన్నికల ఫలితం ద్వారా తమ సత్తా చాటారు.
- కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఫలితాల పరంగా డీలా పడినప్పటికీ.. దాని క్యాడర్ క్షేత్రస్థాయిలో సజీవంగానే ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా పోటీ చేయడం వల్ల న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్‌కు వ్యక్తిగతంగా కోలుకోలేని ఓటమి ఎదురైంది. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు ఉండి ఉంటే, 3వేల ఓట్లు తప్పకుండా కేజ్రీవాల్ వైపు మళ్లి ఉండేవి. ఓటమి నుంచి ఆయనను కాపాడి ఉండేవి.
- న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కూడా ఈసారి భారీగానే ఓట్లు సంపాదించారు.