Site icon HashtagU Telugu

Arvind Kejriwal : ఎట్టకేలకు తిహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్

Aam Aadmi Party PAC meeting today evening

Aam Aadmi Party PAC meeting today evening

Arvind Kejriwal : ఎట్టకేలకు తిహార్ జైలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ను అందించారు.  కేజ్రీవాల్ రక్తంలో షుగర్ లెవల్ 320కి చేరుకోవడంతో ఇవాళ ఉదయాన్నే ఆయనకు ఇన్సులిన్‌ను అందించారు. ఈవిషయాన్ని తిహార్ జైలు అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కీలక  ఆదేశాలు చేసిన తర్వాత.. కేజ్రీవాల్‌కు జైలు అధికారులు ఇన్సులిన్‌ను అందించే ఏర్పాటు చేయడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) ఇన్సులిన్ ఇవ్వడం అవసరమా ? కాదా ? అనేది తేల్చేందుకు వైద్య నిపుణుల టీమ్‌ను ఏర్పాటు చేయాలని సోమవారం రోజు ఢిల్లీ ఎయిమ్స్‌కు రౌస్ అవెన్యూ కోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఆ టీమ్ ఏర్పాటు కాకముందే.. బ్లడ్ షుగర్ లెవల్స్ 320కి చేరాయంటూ.. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ను అందించడం గమనార్హం. సోమవారం రోజు తిహార్ జైలు అధికారులకు కేజ్రీవాల్ కూడా ఓ లేఖ రాశారు. జైలుకు సంబంధించిన వైద్య అధికారులతో కన్సల్టేషన్ సందర్భంగా తాను ఇన్సులిన్ వద్దని అస్సలు చెప్పలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. గత 10 రోజులుగా కూడా తాను ఇన్సులిన్ ఇవ్వమని పదేపదే డాక్టర్లను అడుగుతున్నానని లెటర్‌లో కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న జైలు అధికారులు.. బ్లడ్ షుగర్ లెవల్స్‌లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నందున కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

Also Read :80 Earthquakes : 80 సార్లు కంపించిన భూమి.. పేకమేడల్లా కూలిన భవనాలు.. ఎక్కడంటే ?

ఇటీవల జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ఇండియా కూటమి సభలోనూ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఇన్సులిన్ అంశాన్నే ప్రధానంగా లేవనెత్తారు. జైలులో ఉన్న తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌కు గత నెల రోజులుగా ఇన్సులిన్ ఇవ్వడం లేదని .. ఆయన్ను చంపే కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారని సునీత సంచలన ఆరోపణ చేశారు. వెరసి.. ఎట్టకేలకు మంగళవారం ఉదయాన్నే కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ను అందించారు. ‘‘సీఎం కేజ్రీవాల్ చెప్పిందే నిజమని తేలిపోయింది. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్  అవసరమని గత నెల రోజులుగా మేమంతా చెబుతున్నా తిహార్ జైలు అధికారులు వినిపించుకోలేదు.  ఎట్టకేలకు ఇప్పుడు ఇన్సులిన్ ఇచ్చారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వలేదని ఈ పరిణామంతో తేలిపోయింది’’ అని ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు. ఇన్సులిన్ అంశంతో ఈ ఎన్నికల్లో ప్రజల సానుభూతిని పొందాలని ఆమ్ ఆద్మీ పార్టీ  చూస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా విమర్శించారు. ఆరోగ్యాన్ని కూడా రాజకీయం కోసం వాడుకోవడం దారుణమని ఆయన చెప్పారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్ డయాబెటిక్ అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. అయితే ఆయన షుగర్ లెవల్స్ కంట్రోల్‌లోనే ఉన్నాయి. అలాంటప్పుడు ఎయిమ్స్ వైద్య నిపుణులతో వీడియో కన్సల్టేషన్‌లో  ఇన్సులిన్ కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముంది ?’’ అని వీరేంద్ర సచ్‌దేవా ప్రశ్నించారు.