Army Vehicle Accident : ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. జమ్మూకశ్మీరులోని బందీపుర జిల్లా ఎస్‌కే పాయెన్ ప్రాంతంలోని వులార్ వ్యూపాయింట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆర్మీ వాహనంలోని(Army Vehicle Accident) నలుగురు సైనికులు చనిపోయారు. ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు సైనికులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు సైనికులను మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీనగర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై బందీపుర జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మసరత్ ఇక్బాల్ వాణి మాట్లాడుతూ.. ‘‘గాయపడిన ఏడుగురు సైనికులను మా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారిలో ఇద్దరు అప్పటికే చనిపోయారు. చికిత్స పొందుతూ ఇంకో ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అందించి శ్రీనగర్‌లోని ఆస్పత్రికి పంపించాం’’ అని వెల్లడించారు.
Also Read :Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం.. వాళ్లు మాత్రమే కొనాలి
- అంతకుముందు డిసెంబరు 24న సాయంత్రం పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద ఆర్మీ వాహనం అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు చనిపోయారు. వాహన డ్రైవర్, నలుగురు సైనికులకు గాయాలయ్యాయి. పూంచ్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
- నవంబరు 4వ తేదీన రాజౌరీ జిల్లాలో ఓ లోయలోకి ఆర్మీ వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఓ సైనికుడు చనిపోయాడు. మరో సైనికుడికి గాయాలయ్యాయి.
- నవంబరు 2న రియాసీ జిల్లాలో ఓ లోయలోకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఓ మహిళ, ఆమె పదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read :Delhi Polls : బీజేపీ ఫస్ట్ లిస్ట్.. కేజ్రీవాల్‌పై పర్వేశ్, అతిషిపై బిధూరి పోటీ
మొత్తం మీద ఆర్మీ వాహనాలకు జరుగుతున్న ఈ ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సుశిక్షితులైన డ్రైవర్లు ఉన్నా.. ఆర్మీ వాహనాలు ఎలా అదుపు తప్పుతున్నాయి ? లోయలు ఉండే మార్గాల్లో ఆర్మీ వాహనాలను నడిపే క్రమంలో కనీస జాగ్రత్త చర్యలను పాటించడం లేదా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.