Terror Attack : జమ్మూకశ్మీర్‌లో ఇవాళ ఉదయం మరో ఉగ్రదాడి జరిగింది. అఖ్నూర్‌లోని బట్టల్ ప్రాంతంలో భారత ఆర్మీ వాహనంపై అకస్మాత్తుగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైనికులు ఉగ్రమూకలను బలంగా ప్రతిఘటించారు. ఈ ఘటనలో భారత సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్‌ను(Terror Attack) ప్రారంభించారు.
Also Read :Rama Ekadashi : ఇవాళ రామ ఏకాదశి.. ఉపవాసం, పూజా విధానం వివరాలివీ..
గతవారం బారాముల్లాలో..
గత వారం కశ్మీరులోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై దాడి చేయడంతో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మరణించారు. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ సిబ్బంది, సివిల్ పోర్టర్‌లతో కూడిన కాన్వాయ్ అఫ్రావత్ పరిధిలోని నాగిన్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. గుల్‌మార్గ్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోటపత్రి వద్ద ఈ కాన్వాయ్‌లోని రెండు ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
పదిరోజుల క్రితం గండేర్‌బల్‌లో..
పదిరోజుల క్రితం కశ్మీరులోని గండేర్‌బల్ పరిధిలో ఉన్న గగాంగీర్ ప్రాంతంలో సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు స్థానికేతర కార్మికులతో పాటు ఒక స్థానిక వైద్యుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మొత్తం మీద గత రెండు వారాల వ్యవధిలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన వరుస ఉగ్రదాడుల్లో 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కశ్మీరులో శాంతిభద్రతలకు విఘాతం కలగడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది.
Also Read :Progress Report : ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. రెడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు
ఈ ఉగ్రదాడులు చేసినందుకు ఉగ్రవాదులు పశ్చాత్తాపపడేలా తీవ్రంగా ప్రతిఘటిస్తామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అంటున్నారు. కశ్మీరులోని ఉగ్రమూలాలన్నీ ఏరివేస్తామని ఆయన చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే జమ్మూకశ్మీర్ పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు కలిసికట్టుగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లను మొదలుపెట్టాయి. కశ్మీరు సరిహద్దు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రవాదుల చొరబాటును ఆపే అంశాన్నిప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి.