Site icon HashtagU Telugu

Indian Army : అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నడుమ ఆర్మీ కీలక పోస్ట్..

Army key post amid trade tensions with America..

Army key post amid trade tensions with America..

Indian Army : భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు తాజాగా ఉద్రిక్తంగా మారిన వేళ, భారత సైన్యం చురకలంటించడమే కాక, చారిత్రక పరంగా ముద్ర వేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, దానికి భారత విదేశాంగ శాఖ గట్టిగా బదులు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, భారత సైన్యం పరోక్షంగా అమెరికా ద్వంద్వ ధోరణిపై ప్రశ్నలు పెడుతూ 1971లోని ఒక పాత వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఈస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో మంగళవారం ఓ పాత పత్రిక క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ “ఆ రోజు… ఈ రోజు – 1971 ఆగస్టు 5” అనే శీర్షిక జతచేశారు. ఇందులో 1954 నుంచి పాకిస్థాన్‌కు 2 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఆయుధాలు అనే శీర్షికతో ఉన్న కథనం, అమెరికా గతంలో పాకిస్థాన్‌ను ఎలా ఆయుధాలతో నింపిందో వివరించబడింది. ఇది 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధానికి ముందు కాలానికి చెందింది. ఆయా రోజుల్లో అమెరికా, ఉగ్రవాదులకు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు భారత్ సూచిస్తోంది.

వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు మూలం: చమురు కొనుగోలే

ఇటీవల భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో, “భారత్ రష్యా నుంచి చమురు కొంటూ ఉక్రెయిన్‌లో జరిగే మానవతా విపత్తును పట్టించుకోవడం లేదు. అందుకే భారత్‌పై భారీగా సుంకాలు పెంచుతాను” అంటూ హెచ్చరించారు. అంతేకాక, భారత్ రష్యా వైపు నిలబడడం వల్ల అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

భారత విదేశాంగ శాఖ ఘాటు ప్రతిస్పందన

ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ తక్షణమే ఘాటు ప్రతిస్పందన ఇచ్చింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేస్తూ అమెరికా ఆరోపణలు అన్యాయమైనవి, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో మొదట అమెరికాయే మాకు సూచనలు ఇచ్చింది. ఇప్పుడు అదే చర్యను తప్పుబట్టడం దౌబ్యత ధోరణిని చూపుతుంది అని పేర్కొన్నారు. అంతేకాకుండా, అమెరికా, ఐరోపా దేశాలు తమ అవసరాల కోసం రష్యాతో వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ, భారత్‌ను టార్గెట్ చేయడం అన్యాయమని చెప్పారు. ఉదాహరణకి, అమెరికా ఇప్పటికీ తన అణు విద్యుత్ కేంద్రాల కోసం రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఆ సందర్భంలో భారత్‌ను విమర్శించడం తగదు అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

భారత సైన్యం పోస్టు వెనక సందేశం

ఈ నేపథ్యంలో భారత సైన్యం షేర్ చేసిన పాత వార్తా కథనం ఇప్పుడు కేవలం చరిత్ర స్మరణ మాత్రమే కాదు, సున్నిత రాజకీయ సందేశంగా మారింది. గతంలో పాకిస్థాన్‌ను ఆయుధాలతో ఆదరించిన అమెరికా, ఇప్పుడే భారత్‌పై నీతులు చెప్పడం ఎంత మేర సమంజసం? అనేది ఈ పోస్టు వెనక గట్టి ప్రశ్నగా మారింది. దీనిని దౌత్య వర్గాలు అమెరికాకు భారత వైఖరిని పరోక్షంగా తెలియజేసే ప్రయత్నంగా చూస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఇది సైనిక సామర్థ్యంతో పాటు చారిత్రక అవగాహనను ఉపయోగించి వ్యూహాత్మకంగా అమెరికాకు గట్టి మెసేజ్ అని అభివర్ణిస్తున్నారు.

Read Also: Shigeko Kagawa : ఈ బామ్మకు 114 ఏళ్లు.. హెల్త్ సీక్రెట్ ఇదే..!