PM Modi : ఢిల్లీ కేంద్రంగా నిర్మితమవుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రోజు కొత్తగా నిర్మించిన ‘కర్తవ్య భవన్’ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ భవనాన్ని ఉమ్మడి కేంద్ర సచివాలయ (CCS-3) భవనంగా పరిగణిస్తున్నారు. ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద సిద్ధమయ్యే మొత్తం 10 కార్యాలయ భవనాల్లో మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..దేశ రాజధానిలో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా కొనసాగిస్తోంది. మిగతా 9 భవనాలను కూడా రాబోయే 22 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం అని తెలిపారు.
కొత్త భవనంలో ఏ శాఖలు ఉంటాయంటే?
‘కర్తవ్య భవన్’ కీలకమైన మూడు కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేంద్రంగా మారనుంది.
.హోం వ్యవహారాల శాఖ (Ministry of Home Affairs)
.విదేశీ వ్యవహారాల శాఖ (Ministry of External Affairs)
.పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ (Ministry of Petroleum and Natural Gas)
అలాగే, ప్రధానమంత్రికి ముఖ్య శాస్త్ర సలహాదారు కార్యాలయం కూడా ఇదే భవనంలో ఉండనుంది. ఈ భవనం ఆధునిక టెక్నాలజీ, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించబడింది. పనిదినాల సమర్థతను పెంచేలా, సురక్షిత వాతావరణాన్ని కల్పించేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి.
పాత భవనాలకు వీడ్కోలు
ప్రస్తుతం శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్ వంటి చోట్ల కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కొత్తగా నిర్మితమవుతున్న భవనాల్లోకి తరలించనున్నట్లు సమాచారం. ప్రతి భవనం తరలింపును దశల వారిగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. కొత్త భవనాల్లోకి కార్యాలయాలు పూర్తిగా మారిన అనంతరం, పాత భవనాల కూల్చివేతకు టెండర్లు పిలువనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సెంట్రల్ విస్టా – మోడీ ప్రభుత్వ దూరదృష్టి ప్రతిబింబం
2019లో ప్రధాని మోడీ ప్రారంభించిన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్టు కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదు. అది పరిపాలన, పాలన పునర్నిర్మాణానికి సంకేతం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ భవనానికి కొత్త రూపం ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర కార్యాలయాల సమీకృత నిర్మాణంతో శాసన పరిపాలన వ్యవస్థ మధ్య సమన్వయం, పారదర్శకత మరింత మెరుగవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇది ఒక రకంగా దేశ పరిపాలన యంత్రాంగంలో స్థిరత్వానికి, సమర్థతకు దోహదపడే గమ్యంగా మారుతోంది. నూతన నిర్మాణాలు, ఆధునిక సదుపాయాలు కేంద్ర ఉద్యోగులకు శ్రేయస్కరంగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో అభివృద్ధి పునర్నిర్మాణం వైపు భారతదేశం వేగంగా పయనిస్తోంది.
Read Also: Defamation case : రాహుల్ గాంధీకి ఊరట..అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు