Site icon HashtagU Telugu

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌..

Pakistan Election

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఎదురుదెబ్బ త‌గిలింది. లాహోర్‌ (Lahore) లోని ఆంటీ టెర్ర‌రిజం కోర్టు (Anti-Terrorism Court) నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఇమ్రాన్ మ‌రోసారి జైలుపాల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను ఇటీవ‌లే పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఇమ్రాన్ అరెస్ట్ తో పాక్ వ్యాప్తంగా అల్ల‌ర్లు సైతం చెల‌రేగాయి. ఈ విష‌యమై ఇమ్రాన్ స‌హా పీఐటీ నాయ‌కుల‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌పై విచారించిన ఆంటీ టెర్ర‌రిజం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఇమ్రాన్ ఖాన్‌తో పాటు తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన మ‌రో ఆరుగురు నేత‌ల‌పైకూడా నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్లు కోర్టు జారీ చేసింది. ఇమ్రాన్‌తో పాటు నాన్ బెయిల‌బుల్ వారెంట్లు జారీ అయిన వారిలో పీటీఐ నేత‌లు హ‌స‌న్ నియాజీ, అహ్మ‌ద్ అజార్‌, మురాద్ స‌యూద్‌, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముస‌ర‌త్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంట‌నే అరెస్టు చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు.

తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఓ యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న‌న్ను జైలులో పెట్టినా నేను ప్ర‌భుత్వానికి లొంగిపోను. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన పాల‌న‌, నా దేశ ప్ర‌జ‌ల‌కు మంచి భ‌విష్య‌త్తుకోసం పోరాడుతూనే ఉంటాను అని అన్నారు. ఇమ్రాన్ ఖాన్‌పై 140కిపైగా కేసులు ఉన్నాయి. అయితే, ఇందులో ఉగ్ర‌వాదం, హింస‌, ద‌హ‌న దాడులు, దైవ‌దూష‌ణ‌, హ‌త్యాయ‌త్నం, అవినీతి, మోసానికి ప్ర‌జ‌ల‌ను ప్రేరేపించ‌డం వంటి 19 తీవ్ర‌మైన కేసులు ఉన్నాయి. వీటి విష‌యంలోనే బెయిల్ కోసం సోమ‌వారం ఇమ్రాన్‌ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లారు.

CM KCR: సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వ‌స్తుంద‌ని హామీ ఇచ్చిన‌ కేసీఆర్‌.. కానీ, ఒక్క ష‌ర‌తు