Site icon HashtagU Telugu

Jammu and Kashmir : మళ్లీ మేఘ విస్ఫోటం కలకలం ..నలుగురు మృతి, సహాయ చర్యలు ముమ్మరం

Another explosion in Jammu and Kashmir. Four dead, rescue operations in full swing

Another explosion in Jammu and Kashmir. Four dead, rescue operations in full swing

Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌ ప్రదేశం వరుసగా ప్రకృతి ప్రకోపాలతో అతలాకుతలమవుతోంది. ఇటీవలే కిష్త్వాడ్ జిల్లాలో మేఘ విస్ఫోటం మానవ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన విషాదం మరవక ముందే, మరో విపత్తు కథువా జిల్లాలోని ఘాటీ గ్రామాన్ని వణికించింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా  వర్షాలు భారీగా కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ ప్రాంతంలో కొండలు విరిగిపడి ఓ కుటుంబం శిథిలాల కింద చిక్కుకుపోయిందని సమాచారం. సహాయక చర్యల కోసం వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read Also: Bangkok : యూత్ మెచ్చిన సిటీగా బ్యాంకాక్

ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా సహాక్‌ ఖాద్‌, ఉజ్ నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. వరదలు ముంచెత్తడంతో నదీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయంతో ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లారు. కథువా ప్రాంతంలోని ప్రధాన రహదారులు, రైలు మార్గాలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. రైలు పట్టాలు దెబ్బతిన్నాయి, జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కథువా పోలీస్ స్టేషన్‌ కూడా వరద నీటితో ముంచెత్తింది, పోలీసు సిబ్బంది సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేఘ విస్ఫోటం గురించి సమాచారం అందిన వెంటనే కథువా జిల్లా పోలీసు అధికారి శోభిత్ సక్సేనాతో మాట్లాడినట్లు వెల్లడించారు. సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబాలకు సహాయపడతామని హామీ ఇచ్చారు.

ఇకపోతే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పర్వత ప్రాంతాల్లో భూస्खలనం ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, ప్రజలు అలాంటి ప్రదేశాలకు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతకుముందు మచైల్ మాతా దేవి యాత్ర సమయంలో జరిగిన మేఘ విస్ఫోటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితోపాటు ఇప్పటివరకు 60 మంది మృతి చెందారు. మరో 82 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనల నేపథ్యంలో మేఘ విస్ఫోటాలు జమ్మూ కశ్మీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, వరుస ప్రకృతి విపత్తులు ప్రజల జీవితాలను సవాళ్ల మధ్యకు నెట్టివేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ముందే గుర్తించే టెక్నాలజీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనదీ స్పష్టమవుతోంది.

Read Also: TSRTC : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..టీఎస్ఆర్టీసీలో భారీ నియామకాలకు రంగం సిద్ధం