Chhattisgarh : మరోసారి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దంతెవాడ పోలీసులు సోమవారం ఉదయం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Director Sanoj Mishra Arrested: మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్.. అసలు కథ ఇదే!
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా రేణుక ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె తలపై రూ.25లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీఎత్తున తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రేణుక అలియాస్, ఛైతి అలియాస్ సరస్వతిగా గుర్తించారు. ఈమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గత శనివారం సుక్మా, బీజాపుర్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో 18 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో 11 మంది మహిళలే కావడం గమనార్హం. ఇక, తాజా ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 135 మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది హతమార్చారు. ఇందులో 119 మంది ఒక్క బస్తర్ డివిజన్‌లోనే మరణించినట్లు అధికారులు తెలిపారు. కాగా, దంతెవాడ, బీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ సిబ్బంది యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
Read Also:PM Modi : ప్రధాని మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ..ఇంతకీ ఎవరీమె..?