Anantnag Encounter – The End : కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో వారం రోజులుగా (గత బుధవారం నుంచి) జరుగుతున్న ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ఇవాళ ముగిసింది. ఇన్ని రోజులుగా అనంత్‌నాగ్ జిల్లాలోని కొకెర్‌నాగ్ అటవీ ప్రాంతంలో దాక్కొని ఆర్మీపై దొంగ చాటు కాల్పులకు తెగబడిన ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ ను ఆర్మీ మట్టుబెట్టింది. అతడి నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఉజైర్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను 15వేల అడుగుల ఎత్తులో ఉండే పీర్‌పంజాల్ పర్వత శ్రేణుల్లో ఎన్‌కౌంటర్ చేశారు. ఈ పర్వత శ్రేణులు ఉన్న పూంచ్, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు బాగా పెరిగాయి.
Also read : Aditya-L1 Mission: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఇస్రో.. సూర్యుడి దిశగా ఆదిత్య L1?
పాక్ సరిహద్దును దాటుకొని ఇక్కడకు చేరుకునే ఉగ్రవాదులు.. శ్రీనగర్ లేదా దోడాకు వెళ్లాలంటే అనంతనాగ్ మీదుగానే ప్రయాణించాలి. దీంతో ముష్కర మూకలకు పీర్ పంజాబ్ పర్వతశ్రేణి స్థావరంగా మారింది. కశ్మీర్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్ పంజాల్ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి. పర్వతశ్రేణుల భౌగోళిక స్వరూపం సైనిక ఆపరేషన్లకు ఏ మాత్రం అనుకూలించదు. దీనికితోడు దట్టమైన అడవులు ఉండటం.. ఎంత పెద్ద దళానికైనా సవాలే. ఇదే ఉగ్రవాదులకు అనుకూలంగా మారింది. గత బుధవారం తెల్లవారుజామున ఈ పర్వత శ్రేణుల నుంచి ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 19 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ అశోక్ ధోనక్, కశ్మీరీ పోలీసు డీఎస్పీ హుమయూన్ భట్, ఆర్మీ జవాన్ ప్రదీప్ సింగ్ అమరులయ్యారు. జవాన్ ప్రదీప్ మృతదేహం సెప్టెంబరు 18న సాయంత్రం (Anantnag Encounter – The End) లభ్యమైంది.