ఎన్నికలంటేనే డబ్బుల వ్యవహారం. సొమ్ము ఇవ్వకుంటే ఓట్లు పడవన్నది అభ్యర్థుల అనుభవసారం. ధనం లేకుంటే అసలు పార్టీ టిక్కెటే రాదన్నది వారికి తెలిసిన విషయమే. ఎన్నికలు ధనమయంగా మారడంతో వీటికి తాము సరిపోమంటూ ఎంతో మంది మంచివారు దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. ఇందుకు భిన్నమైన దృశ్యం మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తోంది.
ఓటర్లు తనను డబ్బు అడగరని.. తన ఖర్చులకు వారే ఎదురు ఇస్తారని చెబుతూ ఓ నిరుద్యోగ యువకుడు ఎన్నికల రంగంలో దిగి ధీమాగా ప్రచారం చేసుకొని ముందుకు సాగుతున్నాడు. మణిపూర్‌లోని ఏకైక ఎస్సీ స్థానమైన సెక్మాయి నుంచి రంగంలో ఉన్న 26 ఏళ్ల నింగ్‌తౌజం పోపీలాల్ సింగ్ ప్రస్తుతం ఆకర్షణగా మారాడు. ఆయన నిరుద్యోగి. కుటుంబానికి ఆస్తులేమీ లేవు. ట్యూషన్లు చెప్పుకొని జీవనం కొనసాగిస్తున్నాడు.
మణిపూర్ చిన్న రాష్ట్రమే అయినా కోట్లు ఖర్చుపెట్టగలిగితేనే పార్టీలు టిక్కెట్లు ఇస్తాయి. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తితో తొలుత కాంగ్రెస్‌ను ఆశ్రయిస్తే అక్కడ నిరాశే ఎదురయింది. తరువాత ఎన్‌సీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వడంతో పోటీకి దిగారు. ఆర్థిక వనరులేవీ లేకపోవడంతో ఇంటింటి ప్రచారాన్నే మార్గంగా ఎంచుకున్నాడు. భవిష్యత్తు తరాల సౌకర్యాల కోసం కష్టపడి పనిచేస్తానని చెబుతున్నాడు. ఈ మాటే ఓటర్లను బాగా ఆకట్టుకుంటోంది.
ఓటర్లు ఎవరూ తనను డబ్బులు అడగడం లేదని, వారే తిరిగి విరాళాలు ఇస్తున్నారని చెబుతున్నారు. ఓటర్ల మనసును డబ్బుతో గెలవలేమని నమ్మకంగా చెబుతున్నాడు నింగ్ తౌజం. ఫలితం ఎలా ఉన్నా ప్రచారంలో కొత్తదనం కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. నిజానికి ఈరోజుల్లో ఇలాంటి యువతరమే రాజకీయాల్లోకి రావాల్సి ఉందని ఆ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.