Amit Shah: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశాలు లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, “ఇందిరా గాంధీ స్వర్గం నుండి దిగి వచ్చినా, ఆర్టికల్ 370 పునరుద్ధరించబడదు” అని ఆయన ప్రకటించారు. 2019లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను తొలగించింది. ఈ నిర్ణయం తర్వాత, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు:
ముస్లిం రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ అమిత్ షా ఇలా అన్నారు, “కొన్ని రోజుల క్రితం, ఉలేమాలు (ముస్లిం పండితులు) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలిశారు. ముస్లింలకు ఉద్యోగాలు, విద్యా రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని వారు చెప్పారు. కానీ, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కోటాలు తగ్గించడం అనేది అసాధ్యం. రాహుల్ బాబా, మీరు మాత్రమే కాదు, మీ నాలుగు తరాలు కలిసి వచ్చినా, వారు ఎస్సీ/ఎస్టీలు/ఓబీసీల కోటాను తగ్గించి ముస్లింలకు ఇవ్వలేరు” అని అమిత్ షా స్పష్టం చేసారు.
సోనియాగాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. “రాహుల్ బాబా పేరుతో సోనియా 20 సార్లు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ 20 సార్లు ఆ విమానం కూలిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో 21వ సారి విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని అమిత్ షా పేర్కొన్నారు.
“మీ రాహుల్ విమానం 21వ సారి కూడా క్రాష్ కానుంది,” అని ఆయన అన్న దానికి ఉద్దేశం, మహారాష్ట్రలో తమ పార్టీ గెలుపు ఖాయం అనే ధోరణిని అయన వ్యక్తపరిచాడు. ” ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలన్నది మరి కొద్ది రోజుల్లో మహారాష్ట్ర ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకుంటారు,” అని అమిత్ షా చెప్పారు.