Mahakumbh Mela : ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. 45 రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళాలో ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు అమిత్ షా కుంభమేళాలో పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రాందేవ్ బాబా కూడా పుణ్యస్నానమాచరించారు.
అనంతరం ఘాట్ వద్ద అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించి మహాకుంభమేళా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఇక, అమిత్ షా పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల ప్రదేశాల్లో నిఘా పెంచారు. ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో ఆ రోజున 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 14 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
కాగా, ఈ మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మహాకుంభమేళాకు హాజరు కావచ్చని సమాచారం. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభమేళాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించనున్నారు. సంక్రాంతి రోజున (జనవరి 13) ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ముగుస్తుంది.
Read Also: Brydon Carse: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ పై కన్నేసిన కావ్య పాప