Operation Sindoor : భారత భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతుండటంతో, భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేసేందుకు కేంద్రం అన్ని విభాగాలను ముబ్దుగా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ఏర్పాట్లు గట్టిగా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీకి సమీపంలోని తన నివాసంలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ ఉన్నతాధికారులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. సరిహద్దులు, విమానాశ్రయాలు, అంతర్గత భద్రతపై సమగ్రంగా చర్చించి, తాజా పరిస్థితులను సమీక్షించారు.
Read Also: India – Pakistan War : ఉగ్రదాడుల లైవ్ ప్రసారాలపై కేంద్రం సీరియస్
ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు చేపట్టాయి. పంజాబ్ సరిహద్దులో చొరబడే యత్నం చేసిన పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ జవాన్లు హతమార్చారు. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల పాకిస్థాన్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. అనుమానాస్పదంగా కనిపించే వారిని కాల్చివేయాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని సాంబ జిల్లా సరిహద్దులో చొరబాటు యత్నాలు జరిగిన నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ అప్రమత్తమైంది. కనీసం ఏడుగురు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు, పాకిస్థాన్ నియంత్రణ రేఖకు ఆవల నుంచి భారీ షెల్లింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా జమ్మూ, ఉరి ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఇళ్లను విడిచి వెళ్లిపోతున్న వాసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుగానే చర్యలు తీసుకుంటూ, జాతీయ భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి.
Read Also: Miss World: హైదరాబాద్‌కు మిస్ వరల్డ్ క్రిస్టినా .. అధికారుల ఘనస్వాగతం