Amit Shah and Dada: గంగూలీ ఇంటికి వెళ్లి భోజనం చేసిన అమిత్ షా.. బెంగాల్ సీఎం అభ్యర్థిగా..!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ మమతా బెనర్జీని దీటుగా ఎదుర్కోవడానికి అమిత్ షా చాలా వేగంగా పావులు కదుపుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 10:28 AM IST

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ మమతా బెనర్జీని దీటుగా ఎదుర్కోవడానికి అమిత్ షా చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. అందుకే ఆయన శుక్రవారం నాడు దక్షిణ కోల్ కతాలో ఉన్న బీసీసీఐ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. అక్కడితో ఆగలేదు. ఏకంగా విందు సమావేశం జరపడంతో.. ఇది బెంగాల్ తోపాటు జాతీయస్థాయిలో చర్చనీయాంశగా మారింది.

అమిత్ షా, సౌరవ్ గంగూలీ భేటీ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గంగూలీ భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించడానికి ఇష్టపడుతున్నారు. అంటే కమలం అధిష్టానం అవకాశమిస్తే.. ఆ పార్టీ తరపున బెంగాల్ సీఎం అభ్యర్థిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

దీదీని ఎదుర్కొని అక్కడ పార్టీని పరుగులు పెట్టించాలంటే బీజేపీకి కూడా అంతే ప్రజాదరణ ఉన్న వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని శక్తిగా మార్చి.. ఎలా ముందుకు తీసుకెళ్లాలో అమిత్ షా కు బాగా తెలుసు. అందుకే కిందటి ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయినా.. మెరుగైన ప్రతిభనే కనబరిచింది. ఎక్కువ స్థానాల్లో గెలవగలిగింది. కానీ దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే శ్రమకు తగిన ఫలితం దక్కలేదన్న అసంతృప్తితో
అధిష్టానం ఉందని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లోపు గంగూలీని పార్టీలోకి తీసుకురావాలని కమలదళం కూడా భావిస్తోంది. దీనివల్ల పార్టీ మరింత బలోపేతమవుతుందని అమిత్ షా అంచనా వేస్తున్నారు. అందుకే ముందుగా ఆయన చొరవ తీసుకుని స్వయంగా గంగూలీ ఇంటికి వెళ్లి కలిసి.. దాదాతో కలిసి భోజనం కూడా చేశారు. గంగూలీకి బెంగాల్ లో మంచి ఆదరణ ఉంది. క్రికెటర్ గా, టీమిండియా మాజీ కెప్టెన్ గా ఆయన ఆటతీరే దీనికి కారణం. అందుకే ఆ ఇమేజ్ ను క్యా్ష్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

కిందటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా గంగూలీ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం నడిచింది. ఇప్పుడు మళ్లీ అమిత్ షాతో భేటీ వల్ల గంగూలీ కచ్చితంగా కమలతీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. అయితే తనకు షాతో ఉన్న పరిచయం వల్లే ఆయన తమ ఇంటికి భోజనానికి వచ్చారని.. ఈ సమావేశానికి ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యతా లేదని చెప్పుకొచ్చారు గంగూలీ. ఒకవేళ గంగూలీ కానీ బీజేపీలో చేరితే.. బెంగాల్ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారతాయి.