జమ్మూ కాశ్మీర్‌లోని గుజ్జర్, బకర్వాల్ మరియు పహారీ వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. కోటా అంశాన్ని పరిశీలించిన జస్టిస్ శర్మ కమిషన్ సిఫారసుల మేరకు ఎస్టీ రిజర్వేషన్ ఆ మూడు కులాలకు వస్తాయని వెల్లడించారు. అక్కడ ర్యాలీని ఉద్దేశించి షా మాట్లాడుతూ, గుజ్జర్లు, బకర్వాల్లు మరియు పహారీల ఎస్టీ కోటాను పొందుతారని చెప్పారు.
2019లో ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్ సమాజంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి మార్గం సుగమం చేసిందని ఆయన అన్నారు. “జస్టిస్ శర్మ కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారం పహారీలు, బకర్వాల్ మరియు గుజ్జర్లు ఎస్టీ కోటా ప్రయోజనాల కోసం ఉన్నారు. ఈ సిఫార్సులు స్వీకరించబడ్డాయి మరియు చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే, గుజ్జర్లు, బకర్వాల్లు మరియు పహారీలు రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతారు” అని అమిత్ షా వెల్లడించారు.
పహారీలకు ఎస్టీ హోదా కల్పిస్తున్నారనే పేరుతో కొందరు గుజ్జర్లు, బకర్వాల్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, అయితే ప్రజలు వాళ్ల వ్యూహాలను తిప్పికొట్టారని హోంమంత్రి అన్నారు.జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన షా, గతంలో కేవలం మూడు రాజకీయ కుటుంబాలు రాష్ట్రాన్ని పాలించేవని, ఇప్పుడు అధికారం 30,000 మంది ప్రజలతో ఉందని అన్నారు. న్యాయమైన ఎన్నికల ద్వారా పంచాయతీలు మరియు జిల్లా కౌన్సిల్‌లకు ఎన్నికలు జరిగాయన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాధాన్యత అని అన్నారు. గతంలో అభివృద్ధి కోసం కేంద్రం పంపిన డబ్బులన్నీ కొందరే దోచుకునేవారని, ఇప్పుడు అంతా ప్రజల సంక్షేమానికే వెచ్చిస్తున్నారని అన్నారు.
మూడు కుటుంబాల బారి నుంచి జమ్మూ కాశ్మీర్‌ను విముక్తం చేయాలని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి, సంక్షేమం కోసం మోదీని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులపై మోదీ ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యల కారణంగా జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. ఫలితంగా ప్రతి ఏటా 1,200 మంది భద్రతా బలగాల ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది 136కు తగ్గిందని ఆయన చెప్పారు.