Kandahar Hijack : భారతీయ సెంటిమెంటును దెబ్బతీస్తే ఖబడ్దార్.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం అల్టిమేటం

భారత్‌లో విడుదల చేసే ఓటీటీ సిరీస్‌లు అన్ని కూడా భారతీయ సెంటిమెంట్‌ను గౌరవించేలా ఉండాలని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులకు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Published By: HashtagU Telugu Desk
Kandahar Hijack Netflix

Kandahar Hijack : ‘‘ఐసీ-814 :  ది కాందహార్ హైజాక్’’ ఓటీటీ సిరీస్ ఆగస్టు 29న ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా  విడుదలైంది. దీనిలోని స్టోరీపై దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇవాళ ఉదయం నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు చర్చలు జరిపాయి. భారత్‌లో విడుదల చేసే ఓటీటీ సిరీస్‌లు అన్ని కూడా భారతీయ సెంటిమెంట్‌ను గౌరవించేలా ఉండాలని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులకు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో తప్పకుండా ఇకపై విడుదల చేసే వెబ్ సిరీస్‌లు అన్ని కూడా భారతీయ సెంటిమెంట్‌ను గౌరవించేలా ఉండే విధంగా జాగ్రత్తపడతామని  నెట్‌ఫ్లిక్స్(Kandahar Hijack) ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈమేరకు వివరాలతో జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join

కాందహార్ హైజాక్ ఘటనకు సంబంధించిన వివరాలను ‘‘ఐసీ-814 :  ది కాందహార్ హైజాక్’’ ఓటీటీ సిరీస్ మొదటి ఎపిసోడ్‌లో తప్పుగా చూపించారని తెలుస్తోంది. దీనిపై భారత సర్కారు వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘‘భారత సెంటిమెంటుతో ఆటలాడే హక్కు ఎవరికీ లేదు. భారత కల్చర్, నాగరికతను తప్పకుండా గౌరవించాల్సిందే. ఈ అంశాల గురించి ఎవరైనా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త. దీన్ని సీరియస్‌గా తీసుకుంటాం’’ అని సోమవారం రోజు భారత సమాచార, ప్రసార శాఖ అధికార వర్గాలు కామెంట్ చేశాయి. సోమవారం సాయంత్రంకల్లా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు సమన్లు జారీ చేశారు.  ఈనేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీలో భారత సమాచార, ప్రసార శాఖ ఉన్నతాధికారుల ఎదుట నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు హాజరయ్యారు. భారతీయ సెంటిమెంటుకు విఘాతం కలిగించని కంటెంట్ మాత్రమే ప్రసారం చేయాలని ఈసందర్భంగా వారికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులు తేల్చి చెప్పారు.

1999లో భారత విమానాన్ని తాలిబన్లు హైజాక్‌ చేశారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో ‘ఐసీ 814: ది కాందహార్‌ హైజాక్‌’ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. ఇందులో హైజాకర్ల పేర్లను ‘శంకర్‌’, ‘భోలా’ అని మార్చి చూపించారు. వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చిత్రీకరించడంపై వివాదం రేగింది. హైజాకర్లకు ఓ వర్గం పేర్లను పెట్టడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 03 Sep 2024, 12:45 PM IST