Site icon HashtagU Telugu

Hemant Soren Vs ED : ఈడీకి జార్ఖండ్ సీఎం షాక్.. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కీలక ఆర్డర్స్

Hemant Soren

Hemant Soren Vs Ed

Hemant Soren Vs ED :భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో ఏడుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను దాటవేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీని సవాల్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈడీ దర్యాప్తునకు వస్తే సహకరించవద్దని, ఎలాంటి సమాచారాన్ని, డాక్యుమెంట్స్‌ను అందించవచ్చని జార్ఖండ్ ప్రభుత్వ శాఖలకు ఆర్డర్స్ జారీ చేశారు. దీనిపై ఏ సందేహం వచ్చినా రాష్ట్ర క్యాబినెట్ సెక్రటేరియట్ లేదా విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయాలని(Hemant Soren Vs ED) కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈడీని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి అందే సందేహాలపై రాష్ట్ర క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ విభాగం కలిసి న్యాయ సలహా తీసుకుంటాయన్నారు. న్యాయ సలహా ఆధారంగా సదరు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు గైడ్ లైన్స్ జారీ చేస్తాయని చెప్పారు. అసంపూర్ణ, అసమగ్ర సమాచారాన్ని ఈడీకి అందజేయకుండా నిలువరించేందుకే ఇలా చేయాల్సి వస్తోందని జార్ఖండ్ సర్కారు ప్రకటించింది. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను(ఐటీ) శాఖల దర్యాప్తును అడ్డుకునేందుకే జార్ఖండ్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు అంటున్నారు. కాగా, కాంగ్రెస్‌తో కలిసి జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న జార్ఖండ్ ముక్తి మోర్చా.. జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో కూడా భాగస్వామిగా ఉంది.

Also Read: Adani Drone : హైదరాబాద్‌లో ‘అదానీ డిఫెన్స్’ డ్రోన్ రెడీ.. ప్రత్యేకతలివీ..

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. కేసుల నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. సోరెన్‌ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో భార్య కల్పన సోరెన్‌ బాధ్యతలు చేపట్టవచ్చని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో హేమంత్‌ సోరెన్‌ సోదరి అంజలి సోరెన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కల్పా సోరెన్‌ సీఎం కాబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై అంజిలి సోరెన్‌ను మీడియా ప్రశ్నించింది.  దీనికి ఆమె బదులిస్తూ ‘అవసరమైతే ఆమె సీఎం కావొచ్చు. మా పార్టీలో ఇంకా పలువురు నేతలు ఉన్నారు. అయితే, పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. అవసరమైతే ఆమె సీఎం కావొచ్చు’ అని పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ సోరెన్‌ ప్రభుత్వం గిరిజన ప్రభుత్వమన్నారు. తాము గిరిజనులం కాబట్టే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం పనిలో కొనసాగితే ఆదివాసీల ఓట్లు పడవని భయపడుతున్నారని ఆరోపించారు.