Rajnath Singh: అగ్నిప‌థ్ పై కేంద్రం అత్య‌వ‌స‌ర స‌మీక్ష‌

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమీక్ష చేపట్టారు.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 05:43 PM IST

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమీక్ష చేపట్టారు. ఢిల్లీలో రాజ్ నాథ్ నివాసంలో నిర్వహించిన ఈ సమీక్షకు, ఆర్మీ నుంచి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బీఎస్ రాజు, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి హాజరయ్యారు. అగ్నిపథ్ ప్రకటించిన అనంతరం దేశంలో జ‌రిగిన నిరసనలు, హింసాత్మక ఘటనలపై చ‌ర్చించారు. దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై స‌మీక్షించారు.

త్రివిధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధానం తీవ్ర నిరసన జ్వాలలకు కారణం అయింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడుతున్న సంఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనలు అగ్నిపథ్ పై వ్యతిరేకతకు పరాకాష్ఠగా నిలిచాయి. కానీ, కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ విధానంపై త్రివిధ దళాలు సంతృప్తికరంగానే ఉన్నాయి. యువతకు అగ్నిపథ్ ఓ సువర్ణావకాశమని, అయితే ఈ పథకం గురించి సరైన అవగాహన లేనందునే నిరసనలు వ్యక్తమవుతున్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అభిప్రాయపడ్డారు. నేవీ చీఫ్ ఆర్.హరి స్పందిస్తూ, అగ్నిపథ్ పై ఈస్థాయిలో వ్యతిరేకత ఊహించలేదని అన్నారు. భారత సైన్యంలో అతిపెద్ద మానవ వనరుల నియామక ప్రక్రియ అగ్నిప‌థ్ అంటూ అభివర్ణించారు.

ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి కూడా ఈ విధానంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ పద్ధతిని వద్దంటున్నవారు ముందుగా దీని విధివిధానాలు తెలుసుకోవాలని సూచించారు. అగ్నిపథ్ గురించి పూర్తి సమాచారం పొందాలని, ఈ విధానాన్ని అర్థం చేసుకోవ‌డానికి ప్రయత్నించాలని అన్నారు.